ఆగ్రహంతో ఊగిపోయిన బన్నీ ఫ్యాన్స్.. నాగార్జున్ ‘‘ఎన్ కన్వెన్షన్’’పై దాడి, లాఠీఛార్జ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో సినీతారలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమాన తారల్ని దైవంలా ఆరాధిస్తారు ఫ్యాన్స్. వారిని అనుకరించడం, వారి పుట్టినరోజులు, సినిమా విడుదల సందర్భంగా రక్తదానాలు, అన్నదానాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారు. అయితే అభిమానం హద్దు దాటి అప్పుడప్పుడు రచ్చకెక్కుతూ వుంటుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప ది రైజ్’ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 17న విడుదలవుతుంది.
అయితే అల్లు అర్జున్.. సినిమా విడుదలకు ముందే తన ఫ్యాన్స్‌ని కలుసుకోవాలని.. వారితో మాట్లాడి ఫొటోలు ఇవ్వాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా అభిమాన సంఘాలకు పిలుపు వెళ్లింది. అంతే ఫ్యాన్ మీట్ అంటూ పాసులు సైతం జారీ చేశారు. దీంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు అభిమానులు. అయితే ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం రద్దైందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల నుంచి అల్లు అర్జున్ అభిమానులు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. దీంతో అటువైపు వెళ్లే రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. బారికేడ్లు దాటుకుని మరీ తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేవలం 5000 పాసులు మాత్రమే తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయాస్ క్రియేషన్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్‌పై ఐపీసీ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments