Pinnelli:పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మర వేట.. ఈసీకి డీజీపీ నివేదిక..
Send us your feedback to audioarticles@vaarta.com
పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ఈవీఎంను ధ్వంసం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదే సమయంలో విదేశాలకు పారిపోకుండా రామకృష్ణా రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఈ కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. కీలక నివేదికను పంపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ద్వారా సీఈసీకి ఈ నివేదికను అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు 4 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ అందులో వివరించారు. అలాగే పిన్నెల్లి పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ సర్క్యూలర్ కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఆయన ఆచూకీ కోసం తెలంగాణలో కూడా తనిఖీలు చేస్తున్నామని దొరికిన వెంటనే అరెస్ట్ చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
మరోవైపు అల్లర్లపై సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ఏ-1గా చేర్చినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతూనే ఉంది. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్ల కింద పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఒకటి ఏడేళ్ల జైలు శిక్ష పడే సెక్షన్ కూడా ఉండటం గమనార్హం. ఆయన అరెస్టై జైలులో ఉంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
కాగా హైదరాబాద్‌లో ఉన్న పిన్నెల్లి.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే కారణంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో ఉన్న రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అరెస్ట్ వార్తలను ఖండించారు. మరోవైపు ఆయన విదేశాలకు పారిపోయేందుకు కొంతమంది ఐపీఎస్ అధికారులు సహకిరిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments