హీరోయిన్‌తో బోండా ఉమ అంటూ పిక్స్.. పోలీసులకు ఫిర్యాదు
- IndiaGlitz, [Thursday,October 15 2020]
తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు ఎలా దొరుకుతారా? అని అధికార పక్షం నేతలు ఎదురు చూస్తూ ఉంటారు. సేమ్ అధికార పక్షం నేతలు ఏదో ఒక అంశంలో దొరికినా కూడా విపక్ష నేతలూ వదలరు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ నుంచి బయటకు వస్తుండగా తీసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోటల్ నుంచి రావడంలో తప్పేముంది అనుకుంటున్నారా? దానిలో తప్పేం లేదు కానీ ఆయన వెనుక ఓ యువతి ఉంది. ఇది తప్పై పోయింది.
నిజానికి ఆ యువతి ఎవరో.. అసలు బోండా ఉమకు ఆమె తెలుసో.. లేదో అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ దొరికిందే ఛాన్స్ అని ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. కనీసం ఆమె మొహం కూడా క్లారిటీగా కనిపించట్లేదు కానీ బోండా ఉమ ఓ హీరోయిన్‌తో కలిసి హోటల్ నుంచి బయటకు వస్తున్నారంటూ పిక్స్ వైరల్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని బోండా ఉమ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తన వెనుక వస్తున్న వ్యక్తి తనకు ఎవరో కూడా తెలియదని.. కానీ తనపై దుష్ప్రచారం చేస్తారా? అంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బోండా ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు కాపీని అందజేస్తున్న ఫొటోను బొండా ఉమ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్టు కూడా పెట్టారు. ‘‘తప్పుడు ఆరోపణలు చేయటం కాదురా జఫ్ఫా పెటియం బ్యాచ్.. దమ్ముగా పోలీస్ కంప్లయింట్ ఇచ్చా. జైల్‌కు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. మీ నాయకుడి ఫేవరేట్ జైల్ చంచల్ గూడా జైల్ మేనేజ్ చేయటానికి ఏపీ పోలీస్ కాదు’’ అని బోండా ఉమ పోస్ట్ పెట్టారు.