216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ.. రామానుజులపై ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు సొంతం చేసుకుంది. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 దివ్య తిరుపతుల నిర్మాణం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారని ప్రశంసించారు. ఆయన ప్రవచించిన విశిష్టాద్వైతం మనకు ప్రేరణ అని.. భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారని మోడీ పేర్కొన్నారు. రామానుచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని... మనిషికి జాతి కాదు, గుణం ముఖ్యమని చాటి చెప్పారని మోడీ కొనియాడారు. తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని.. రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామ పురస్కారం వరించిందని మోడీ గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ ఖ్యాతిని గడిస్తోందని ప్రధాని అన్నారు.
216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహం నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. సమతాస్ఫూర్తి కేంద్ర ఏర్పాటు ఆలోచన 2013లో అంకురించగా, 2014 మే నెలలో బీజం పడింది. 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా.. రిక్టర్ స్కేల్‌పై 9 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. కాకతీయుల నిర్మాణశైలితో నాలుగు తోరణాలు నిర్మించారు. 108 దివ్యదేశాలన్నింటికీ కలిపి దివ్య మండపం ఉంటుంది. 1,88,500 చదరపు అడుగుల విస్తీర్ణం.. 2,691 అడుగుల పొడవు, 603 అంగుళాల వెడల్పుతో దీనిని నిర్మించారు. రాజస్థాన్‌లోని బీస్‌వాలా నుంచి సేకరించిన నల్లని మార్బుల్‌తో వాటిని తయారుచేశారు. ఇందుకోసం 75 వేల ఘనపుటడుగల రాయిని ఉపయోగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout