Omicron BF 7 Variant : కమ్ముకొస్తున్న కోవిడ్ ముప్పు... కాసేపట్లో మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

మానవాళిని రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య బందీని చేసి ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి పీడ వదిలిపోయిందని అంతా భావిస్తున్న వేళ.. చైనాలో వైరస్ వీర విహారం చేస్తోంది. లెక్కకు మిక్కిలి కేసులతో డ్రాగన్ వణికిపోతోంది. నిబంధనల్ని ఒక్కసారిగా ఎత్తివేయడంతో చైనాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతూ వుండగా.. మార్చురీలు, శ్మశానాలు కోవిడ్ మృతులతో రద్దీగా వున్నాయి. చైనాలో పరిస్ధితులు ప్రపంచాన్ని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. చాలా దేశాలు కఠిన లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ద్వారా వైరస్‌ను అదుపులో పెట్టేందుకు ఎంతో శ్రమించాయి. తీరా ఇప్పుడు పరిస్ధితులు చక్కబడుతున్నాయి అనుకునేలోపు.. కోవిడ్ మరోసారి కాచుకుని కూర్చోవడంతో ఆయా దేశాలు వణికిపోతున్నాయి.

భారత్‌లో నాలుగు ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ (Omicron BF 7 Variant)కేసులు :

తాజాగా చైనాలో కోవిడ్ విస్పోటనానికి కారణమైన ‘‘ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్’’ పలు దేశాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. మనదేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటికే గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక కేసును నిర్ధారించారు. కేసులు వృద్ధి చెందక ముందే.. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ టెస్టులను పెంచింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు అధికారులు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు సైతం ప్రారంభించింది.

మోడీ (PM Narendra Modi)అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ :

చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం, భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్(Omicron BF 7 Variant)వెలుగుచూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. దేశంలోని కరోనా పరిస్ధితులపై ఆయన గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.