Covid:భారత్‌లో ఒకే రోజు 1000 కరోనా కేసులు.. ఉలిక్కిపడ్డ కేంద్రం, సాయంత్రం మోడీ హైలెవల్ మీటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మూడేళ్లు గడుస్తున్నా ప్రపంచానికి కోవిడ్ పీడ మాత్రం పోవడం లేదు. తగ్గినట్లే తగ్గిన ఈ మహమ్మారి వేరే వెరియేంట్ల రూపంలో మానవాళిపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే చైనా, హాంకాంగ్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో కరోనా విలయతాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అటు భారత్‌లోనూ కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కావడంతో కేంద్రం ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిన్న ఒక్కరోజు 1134 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 7,026 యాక్టీవ్ కేసులు వుండగా.. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ కారణంగా మరణించారు.
కోవిడ్ ఉద్ధృతికి ఈ వేరియంటే కారణమా:
ఇకపోతే.. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి కోవిడ్ వణికిస్తోంది. సెకండ్ వేవ్‌లో భయానక పరిస్ధితులను చూసిన ఢిల్లీ.. తాజాగా కేసుల పెరుగుదలతో ఉలిక్కిపడింది. మంగళవారం ఒక్కరోజే అక్కడ 83 కేసులు వెలుగుచూడగా.. పాజిటివిటీ రేటు 5.83 శాతంగా నమోదైంది. భారతదేశంలో దాదాపు 129 రోజుల తర్వాత కరోనా కేసులు వెయ్యి మార్కును చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వల్ల కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా వున్నప్పటికీ.. భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. అయినప్పటికీ ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచిస్తున్నారు.
ఉన్నత స్థాయి సమీక్షకు మోడీ పిలుపు :
మరోవైపు దేశంలో కోవిడ్ కేసులు 1000 మార్కును దాటడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని అధికారులతో చర్చించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments