Krishnam Raju: నాయకుడిగా, నటుడిగా ఆయన సేవలు ఆదర్శనీయం : కృష్ణంరాజు మృతిపట్ల మోడీ సంతాపం

తెలుగు సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, తోటి నటీనటులు, సినీ , రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రధాని వేరు వేరుగా ట్వీట్ చేశారు.

‘‘శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యా : అమిత్ షా

అటు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ‘‘తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి.’’ ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు.

అప్పట్లో ప్రభాస్‌తో కలిసి మోడీని కలిసిన కృష్ణంరాజు:

ఇకపోతే.. నరేంద్ర మోడీ ప్రధాని అయిన కొత్తల్లో ఆయనను ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు కలిశారు కృష్ణంరాజు. ఈ సమయంలో ఏపీలో బీజేపీని మరింత విస్తరించే ప్రణాళికలపై కృష్ణంరాజుతో మోడీ చర్చించినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.