PM Narendra Modi:సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌ను ప్రారంభించిన మోడీ.. కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ పచ్చజెండా ఊపి వందే భారత్‌ను ప్రారంభించారు మోడీ.
ప్రతికూల పరిస్ధితుల్లోనూ అభివృద్ధి దిశగా భారత్ :
ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కరోనా , ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలో ప్రతికూల పరిస్ధితులు నెలకొన్నాయన్నారు. అయినప్పటికీ భారతదేశం మాత్రం ప్రగతి పథాన పయనిస్తోందని..ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రధాని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో భారత్ రూపు రేఖలు సమూలంగా మార్చామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
కుటుంబపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం :
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తున్నామని.. ఒకేరోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేశామని.. హైదరాబాద్-బెంగళూరు మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని మోడీ చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడుతుంటే కొందరు బాధపడుతున్నారని చురకలంటించారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. నిజాయితీతో పనిచేసేవారంటే అవినీతిపరులకు భయమని.. అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రంతో కలిసి రాష్ట్రం కలిసి రావడం లేదని మోడీ పేర్కొన్నారు. కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout