దేశం పెను సవాల్ ఎదుర్కొంటోంది.. అందరూ ఇలా చేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ఘ ప్రసంగం చేసిన ఆయన దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాకుండా కరోనా విషయంపై కూడా ఆయన మాట్లాడారు. ‘ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది. కరోనా వైరస్ కారణంగా దేశం పెను సవాల్‌ను ఎదుర్కొంటోంది. కరోనాపై పోరులో దేశ ప్రజలు సంఘటితం కావాలి. సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అమోఘం. నిన్నటి దివ్వెల కార్యక్రమం మన ఐకమత్యాన్ని చాటింది. కరోనాపై పోరులో మన సంకల్పాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఇలా చేయండి..!
‘గతంలో యుద్ధాల సమయాల్లో కేంద్రానికి విరాళాలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి యుద్ధం కంటే తక్కువేమీ కాదు. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా బీజేపీ కార్యకర్తలు సాయం చేయాలి. కరోనాపై యుద్ధంలో మనం విజయం సాధించాలి. కరోనాపై అప్రమత్తత కోసం కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను తెచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్ సోకినవారు మన చుట్టూ ఉంటే యాప్ సమాచారం ఇస్తుంది’ అని మోదీ ఈ సందర్భంగా కార్యకర్తలకు నిశితంగా వివరించారు.
ప్రపంచానికి ఇది ఉదాహరణ
‘నిన్న రాత్రి 9 గంటలకు 130 కోట్ల మంది ఐక్యతను చూశాం. కరోనాపై జరుగుతున్న పోరాటంపై అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు తమ ఐక్యతను చాటారు. భారత్‌లాంటి అతి పెద్ద దేశంలో లాక్‌డౌన్‌ను ఇంతటి క్రమశిక్షణతో పాటిస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచానికి భారత్ ఉదాహరణగా నిలిచింది. ఈ వైరస్ తీవ్రత గురించి ముందుగానే అర్థం చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, శక్తి మేరకు అమలు చేస్తోంది’ అని మోదీ అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments