Modi Hyderabad Visit: రేపు హైదరాబాద్‌కు మోడీ.. రెండు రోజుల పాటు ఇక్కడే, షెడ్యూల్ ఇదే
- IndiaGlitz, [Friday,July 01 2022]
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోనే వుండనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
రెండవ తేదీ (శనివారం):
12 .45 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 .55 గంలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు మోడీ. 3 గంలకు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ బయల్దేరి.. 3.20 గంలకు HICC నోవాటేల్ కి ప్రధాని చేరుకుంటారు . అనంతరం 3.30 నోవాటేల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు.
మూడవ తేదీ (ఆదివారం):
ఆదివారం ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు హెచ్ఐసీసీ హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6.15 నిమిషాలకు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి 6 .30 నిమిషాలకి రోడ్డు మార్గాన పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ చేరుకుంటారు. 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని . అనంతరం రాత్రి 7.35 అక్కడి నుంచి బయల్దేరి రాత్రికి నోవాటేల్ లేదా రాజ్ భవన్ లో మోడీ బస చేయనున్నారు.
నాలుగవ తేదీ (సోమవారం):
సోమవారం ఉదయం 9.20కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉ 10.10కి విజయవాడకు చేరుకుంటారు. అయితే ఈ పర్యటనలో మార్పులు చోటు చేసుకునే అవకాశం వుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రత:
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీల పనివేళల్లో మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ వరకు ఆంక్షలు విధించారు. ఎస్పీజీ సూచనలతో నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలను మోహరించారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళన విధ్వంసానికి దారితీసిన నేపథ్యంలో పోలీసులు సెక్యూరిటీని పెంచారు.