లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత ఏడాదిని మించి ఈ ఏడాది కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా అయితే లక్ష కేసులకు పైగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో మరోమారు లాక్డౌన్ విధిస్తారన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.
దీనిపై మోదీ నేడు ముఖ్యమంత్రుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. దేశంలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్న ఆయన.. కరోనాతో పోరాటం చేసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరారు. అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఈ సెకెండ్ వేవ్‌తో మనందరం పోరాడాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి రోజువారి కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్‌ను నిర్వహించాలని మోదీ సూచించారు. దీనిలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారంతా టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పిచాలన్నారు.
ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారన్నారు. ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందన్నారు. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మోదీ తెలిపారు. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులకు మోదీ చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 30 మందిని ట్రేస్ చేయాలని.. కరోనా రోగుల కాంటాక్టులను 72 గంటల్లోనే గుర్తించి పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీకా వృథాను అరికట్టాలని.. జీరో వేస్టేజ్ లక్ష్యంగా ముందుకు వెళదామని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments