Maldives: అట్లంటుంది మరి.. ప్రధాని మోదీ దెబ్బకు మాల్దీవులు విలవిల..
Send us your feedback to audioarticles@vaarta.com
'లక్షద్వీప్' ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రధాని మోదీ(PM Modi) లక్షద్వీప్(Lakshadweep) పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఈ పేరు గురించి అన్వేషించే వాళ్లు పెరిగిపోయారు. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్‌పైనా, మోదీపైనా అక్కసును వెళ్లగక్కుతూ ముగ్గురు మంత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు అనే నినాదం ఎత్తుకున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం దెబ్బకు దిగొచ్చింది. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేస్తూ క్షమాపణలు చెప్పింది.
బాయ్‌కాట్ మాల్దీవులు నినాదం..
మరోవైపు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మాల్దీవుల పర్యటనను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అలాగే భారత్‌లో లక్షద్వీప్‌తో పాటు అండమాన్, గోవా, ఉడిపి తదిరత ప్రాంతాల్లో అందమైన పర్యాటక ప్రాంతాలున్నాయని.. వాటిని సందర్శించాలని కోరుతున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఎంతలా అంటే ఆ దేశంలో హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్లను పెద్ద మొత్తంలో రద్దు చేసుకుంటున్నారు. అలాగే లక్షద్వీప్ గురించి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మైట్రిప్‌లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధాని పర్యటన తర్వాత ఈ ద్వీప సమూహం గురించి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శోధించినట్లు తెలిపింది.
అధ్యక్షుడిగా భారత్ వ్యతిరేకి..
హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు భారత్ తొలి నుంచి పెద్దన్నగా వ్యవహరిస్తుంది. ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే చైనా ఎంట్రీతో భారత్‌తో మాల్దీవుల దేశం సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌ను దెబ్బతీసేందుకు డ్రాగన్ కంట్రీ మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవుల వంటి దేశాలను ఆర్థికంగా ఆశ చూపించింది. గతేడాది మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూల వ్యకిగా ఉండే మహ్మద్ ముయిజ్జూ ఆ దేశ అధ్యక్షుడయ్యారు. దీంతో అప్పటి నుంచి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.
చైనా అండ చూసుకుని..
మాల్దీవుల ఆదాయం ఆ దేశ పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ దేశంకు వచ్చే ఆదాయంలో 90శాతం పర్యాటకం ద్వారానే వస్తుంది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ తాజాగా లక్షద్వీప్ పర్యటన చేపట్టారు. దేశంలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడి మంత్రులు మోదీపై అక్కసు గక్కారు. ఈ విమర్శలపై భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఆ దేశ నేతలు మాల్దీవుల ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. చైనా అండ చూసుకుని భారత్‌ను కవ్వించాలని చూస్తే ఏం జరుగుతుందో చిన్న శాంపిల్ మాత్రమే చూపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశం ఆర్థికంగా దివాళా తీయడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments