PM Modi:అంతరిక్షంలోకి వెళ్లేది వీరే.. వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ..

  • IndiaGlitz, [Tuesday,February 27 2024]

భారతదేశం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్(Gaganyaan) కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రపంచానికి తెలియజేశారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో అంతరిక్షంలోని వెళ్లనున్నట్లు ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో గగన్‌యాన్ పురోగతిని సమీక్షించారు. అనంతరం గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను వెల్లడించారు.

ఈ సందర్భంగా వారిని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఒవేషన్‌తో వారిని మోదీ సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈరోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. అలాగే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్న తరుణంలో గగన్‌యాన్‌ ప్రయోగం మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని తెలిపారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమని పేర్కొన్నారు.

గతంలో 40 ఏళ్ల క్రితం భారత్ తరపున అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే రష్యా ప్రయోగించిన రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు నలుగురు భారతీయులు స్వదేశి వ్యోమనౌక నుంచి అంతరిక్షంలో అడుగు పెట్టనున్నారు. కాగా ఈ వ్యోమగాముల బృందం కొద్దికాలం పాటు రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ వారిని తీర్చిదిద్దింది. ఆ శిక్షణ పూర్తి కావడంతో ప్రస్తుతం కేరళలోని ఇస్రో సెంటర్‌లో వారు ట్రైనింగ్ పొందుతున్నారు.

కాగా 2025లో గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురానున్నారు. దీంతో వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా అన్ని విభాగాల్లో కఠిన శిక్షణ పొందుతున్నారు.