Modi, Sonia Gandhi: టార్గెట్ సౌత్.. తెలంగాణ నుంచి ప్రధాని మోదీ, సోనియా గాంధీ పోటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మరోమారు అధికారం కాపాడుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలపై రివ్యూ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలపై లోతుగా విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వైఫల్యాలను అధిగమించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు.
మరోవైపు ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ.. దక్షిణాదిన మాత్రం పాగా వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సౌత్‌లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే 17 ఎంపీ స్థానాల్లో కనీసం 12 సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్నారట.
ఇందులో భాగంగా మోదీని సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో కనపడి అత్యధిక ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఇక్కడ కూడా అనుసరించాలని పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారట. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే కర్ణాటకతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని కమలం నేతలు అనుకుంటున్నారట.
ఇక ఇదే వ్యూహం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంటే ఆమెను కూడా రాష్ట్రంలోని ఏదో ఒక్క నియోజకవర్గం నుంచి బరిలో దింపితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కర్ణాటకలోని 28 నియోజకవర్గాల్లో 20 స్థానాలకు పైగా దక్కించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే కలిసివస్తుందనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. మొత్తానికి రెండు పెద్ద పార్టీలు ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments