కరోనా వైరస్‌పై ప్లాస్మా ఓ బ్రహ్మాస్త్రం: రాజమౌళి
- IndiaGlitz, [Tuesday,August 18 2020]
కరోనా వారియర్స్ ప్లాస్మాను దానం చేయాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. ప్లాస్మా డొనేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి సెలబ్రిటీల ద్వారా అవగాహనను కల్పిస్తున్నారు. మంగళవారం జరిగిన ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో రాజమౌళి, రమా రాజమౌళి పాల్గొన్నారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారని అనుకున్నాను. కానీ రక్షకభటులు అనే పేరుని వారు సార్ధకం చేసుకుంటున్నారు. సమాజాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని రాజమౌళి తెలిపారు. కరోనా సోకిన వారిని కాపాడటానికి రోజుకి డెబై మంది ప్లాస్మా దాతలను తీసుకురావడం చాలా గొప్ప విషయమని రాజమౌళి అన్నారు.
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ ‘‘ప్రతిరోజూ ఎంతో మంది హీరోలను చూసే నేను ఈరోజు ప్లాస్మా దాతలను చూస్తుంటే హీరోలను చూసినట్లే అనిపిస్తుంది. నేను కూడా త్వరలోనే ప్లాస్మా డొనేట్ చేస్తాను. కరోనా వారియర్‌ను అవుతాను. ప్లాస్మాను దానం చేస్తే ఏమవుతుందోనని దాతల తల్లిదండ్రులు భయపడుతున్నారని, కానీ ఎలాంటి భయం అవసరం లేదు. మీ పిల్లలు హీరోలయ్యే అవకాశాన్ని వదులుకోకండి. కరోనా వైరస్‌పై ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం. కరోనా వైరస్ చాలా బలహీనమైన వైరస్. ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రతి రోగిని కాపాడుకోవచ్చు. ప్లాస్మా డొనేషన్‌లో అందరినీ ముందుకు నడిపిస్తున్న సీపీ సజ్జనార్‌గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను** అని అన్నారు రాజమౌళి.