తెరపైకి మరాఠా యోధుడి చిత్రం
- IndiaGlitz, [Thursday,February 20 2020]
భారతదేశంలో హిందుత్వ ఉనికి కోసం నాటి మొఘలు చక్రవర్తులతో పోరాటం చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. ముఖ్యంగా ఔరంగజేబుని గడగడలాడించాడు శివాజీ. ఈయన జీవితం సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని హీరో రితేష్ దేశ్‌ముఖ్ అధికారికంగా ప్రకటించారు. సైరట్ దర్శకుడు నాగరాజ్ మంజులే ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. సంగీత ద్వయం అజయ్- అతుల్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించనున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నారు. మొదటి భాగానికి శివాజీ అని.. రెండో భాగానికి రాజా శివాజీ అని, మూడో భాగానికి ఛత్రపతి శివాజీ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. తొలి భాగం 2022లో విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించడం విశేషం.
పాన్ ఇండియా చిత్రంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. బ్రహ్మాస్త్ర తర్వాత మూడు భాగాలుగా రూపొందనున్న చిత్రమిదే. బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా గురించిన అధికారిక ప్రకటనను వెలువరిచింది. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో శివాజీ పాత్రను చూఛాయగా చూపించారు కానీ.. ఆయన పాత్ర గొప్పతనాన్ని ఎక్కువగా ఎక్కడా ఆవిష్కరించలేదు. కానీ తొలిసారి ఆయన బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమాను ఎంత ఆసక్తికరంగా తెరకెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది.