వైఎస్ జగన్ గెలిస్తే ‘పీకే’కు కీలక పదవి!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ‘పీకే’ సేవలు వినియోగించుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేంటి.. పీకేకు జనసేన పార్టీ ఉంది.. ఆయన ఎవరితో కలవకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేశారుకదా..? మరి జగన్.. ‘పీకే’ని వాడుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇక్కడ మీరనుకుంటున్నట్లుగా పీకే అంటే పవన్ కల్యాణ్ కాదండోయ్.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఇక్కడ పీకే అంటే ‘ప్రశాంత్ కిశోర్’. అదేనండి.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారే ఆయనే.
వైసీపీకి అన్నీ తానై..
తన తెలివి తేటలు, మాస్టర్ ప్లాన్లతో పలువురు పెద్దలను సీఎం, పీఎం పీఠాన్ని ఎక్కించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఆయన పనితనాన్ని గుర్తించిన వైఎస్ జగన్.. వైసీపీ కోసం పనిచేయాలని రిక్వెస్ట్ చేసి కోట్లిచ్చి పీకేను కొనుకున్నారు!. జగన్ రిక్వెస్ట్ మేరకు రంగంలోకి దిగిన పీకే టీమ్.. నియోజకవర్గాలన్నీ కలియదిరిగి వాస్తవ పరిస్థితులన్నీ తెలుసుకుని దాన్ని బట్టి అధికార పార్టీ టీడీపీని ఎలా ఎదుర్కోవాలి..? జనాల్లోకి ఎలా వెళ్లాలి..? అని పాదయాత్ర మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, పోలింగ్ మేనేజ్మెంట్ వరకూ అన్నీ తామై పీకే టీమ్ చూసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీకి తీర్పిచ్చేశారని.. అధికారికంగా మే-23న ఎన్నికల కమిషన్ ప్రకటించబోతోందన్న గట్టి ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే పీకే టీమ్‌తో ప్రత్యేకంగా వైఎస్ జగన్ కలవగా.. సీఎం సీఎం అని టీమ్ నినాదాలతో హోరెత్తించింది.
కీలక పదవా..? నంబర్-2 నా!?
ఇక ఇవన్నీ అటుంచితే.. వైసీపీ అధికారంలోకి రాగానే కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత ‘పీకే’కు కూడా కీలక పదవి ఇచ్చి ఆయన సేవలను ఏపీకి వాడుకోవాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన పీకే అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలా వ్యూహాలు రచిస్తూ.. రచిస్తూ తిన్నగా రాజకీయాలవైపు తిరిగారు. అయితే ప్రస్తుతం బీహార్ సీఎం నీతిశ్ కుమార్ పార్టీ అయిన జనతా దళ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంటే నితీశ్ తర్వాత పార్టీలో నంబర్-02 ప్రశాంత్ కిశోరే అన్న మాట. ఈ తరుణంలో అటు పీకే రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారా..? వైఎస్ జగన్ ఇచ్చే కీలక పదవి తీసుకుంటారా..? లేదా జనతాదళ్‌ను పూర్తిగా వదిలేసి.. ఏపీలోనే కీలక పదవి చూసుకుంటూ.. ఎన్నికల, రాజకీయ వ్యూహకర్తగా మిగిలిపోతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments