BJP leader Laxman:ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు తాము కూడా ట్యాపింగ్ బాధితులం అంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చునని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.
ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్క్‌లు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీడను కూడా నమ్మరని.. అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పలువురి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ట్యాపింగ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని.. వీటిపై త్వరగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మద్యం కేసులో కవిత అరెస్టయ్యారని.. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాల్సిందే అన్నారు.
ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి కదల్లేదని.. ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పథకాల్లో కుంభకోణాలు, కమీషన్లు నడిచాయని తెలిపారు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం ఇంకా పోవడం లేదని విమర్శించారు. ఇక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెర మీదకి తెస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. అందుకే ట్యాపింగ్ వ్యవహారం సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి లీకువీరుడు కాదు గ్రీకువీరుడు అని నిరూపించుకోవాలని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments