రజనీకాంత్.. ఈ దక్షిణాది సూపర్‌స్టార్ సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అయితే గత చిత్రాలు ఆయన క్రేజ్‌ను అందుకోలేకపోయాయి. అందుకు కారణాలు అనేకం. ఇలాంటి తరుణంలో గత ఏడాది నవంబర్ `2.0`తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన తలైవా రజనీకాంత్.. రెండు నెలలు గ్యాప్ కూడా లేకుండా మరో సినిమాకు సిద్ధమైపోయాడు. అదే `పేట`. ఈ సినిమాపై, రజనీకాంత్ పాత్రపై పలు రకాల వార్తలు వినపడుతూనే వస్తున్నాయి. పిజ్జాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్‌కి పెద్ద అభిమాని.. మరి దర్శకుడు హీరోకి అభిమాని అయితే సినిమా ఎలా ఉంటుంది? అసలు పేట అంటే అర్థమేమి? త‌్వరలోనే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు వినపడుతున్న తరుణంలో `పేట` ఆయనకు సక్సెస్‌ను ఇస్తుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథంటో చూద్దాం...
కథ:
ఓ కాలేజ్‌లో సీనియర్స్ జూనియర్స్‌ను ర్యాగింగ్ చేస్తుంటారు. ఆ కాలేజ్‌లో ర్యాగింగ్ చేసే బ్యాచ్‌కి హెడ్ మైకేల్(బాబీ సింహ). అతని తండ్రి లోకల్ గూండా... కాలేజ్, హాస్టల్ కుకింగ్ కాంట్రాక్టర్ కావడంతో ఎవరూ అతన్ని ఏమీ అనరు. ఆ సమయంలో కాళి(రజనీకాంత్) ఆ కాలేజ్‌లోకి హాస్టల్ వార్డెన్‌గా చేరుతాడు. తొలిరోజే మైకేల్ అండ్ బ్యాచ్‌కు చెక్ పెడతాడు. హాస్టల్‌లో చదివే అన్వర్ అనే కుర్రాడి ప్రేమ సహాయం చేస్తాడు. అదే క్రమంలో ప్రాణిక్ హీలర్ మంగళ(సిమ్రాన్)ను ఇష్టపడతాడు. కథా ఇలా సాగుతుండగా ఓ రోజు హాస్టల్‌లో విద్యార్థులకు చేసే ఆహారం బాగా లేదని తెలిసి ఆ ఫుడ్ కాంట్రాక్ట్ తీసుకున్న మైకేల్ తండ్రి భరతం పడతాడు. దాంతో కాళిని కొట్టడానికి అతను కొంత మంది గూండాలను పంపుతాడు. కానీ వారితో పాటు మరికొందరు గూండాలు కలిసి కాళీని, మైకేల్‌ను, అదే హాస్టల్‌లో చదివే అన్వర్ అనే కుర్రాడిని చంపడానికి ప్రయత్నిస్తారు. వారిని కాళీ . వారిని కాళీ అడ్డుకుంటాడు. అప్పుడు కాళీ అసలు పేరు పేట వీర అని తెలుస్తుంది. అసలు పేట వీర తన పేరు ఎందుకు కాళి అని మార్చుకున్నాడు? అన్వర్, పూర్ణ ఎవరు? మాలిక్ ఎవరు? సింఘ, జిత్తు ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం రజనీకాంత్. ఈ సినిమాలో రజనీకాంత్ కొత్త తరహాలో కనపడతాడు. అంటే ఇంత పెద్ద ఏజ్‌లో కూడా ఆయన ఎనర్జిటిక్‌గా ఉండటం, నటించడం, డ్యాన్సులు చేయడం అన్నీ మెప్పిస్తాయి. ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకునేలా సంభాషణలు, డ్యాన్సులు ఉన్నాయి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ..అభిమాన హీరో రజనీకాంత్‌ను కబాలి, కాలా స్టైల్‌లో కాకుండా రిఫ్రెష్ చేసి చూపించారు. నవాజుద్దీన్ సిద్ధికీ, విజయ్ సేతుపతి విలన్ పాత్రల్లో చక్కగా నటించారు. ఫస్టాఫ్ అంతా కామెడీ యాంగిల్‌లో సాగుతుంది. సెకండాఫ్‌లో ఫైట్స్ బావున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బావుంది. అనిరుధ్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. తిరు కెమెరా పనితనం బావుంది.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ రేంజ్ తగ్గింది. ఫస్టాఫ్‌లో కథే ఉండదు. అంతా రజనీకాంత్ స్టైల్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అసలు కథంతా సెకండాఫ్‌లోనే కాబట్టి అక్కడ సినిమా సాగదీతగా అనిపిస్తుంది.
విశ్లేషణ:
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్ స్టైల్‌ను బేస్ చేసుకుని, కమర్షియల్ విలువలను ఆధారంగా చేసుకుని కథను అల్లాడు. ప్రతి సీన్‌ను రజనీకాంత్ అభిమానులు మెచ్చేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా డ్యాన్సులు కూడా రజనీకాంత్‌తో చేయించి.. కొత్త రజనీకాంత్ కనపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే రాజకీయాల్లో రజనీ అంటున్న తరుణంలో ..డైలాగ్స్ కూడా ఆయన అభిమానులకు నచ్చేలా రాయించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ఇక మాస్ బీట్స్‌తో అనిరుధ్ ఆ సన్నివేశాలను ఫ్యాన్ మూమెంట్స్ చేసేశాడు. సంభాషణలను చూస్తే..
నా పని అయిపోయిందనుకున్నార్రా..
కొత్తగా వచ్చిన వాడ్ని అణగదొక్కే పాలసీ ఇక్కడ(కాలేజీ)లోనే మొదలవుతుంది..
కడుపు మీద కొట్టారు కదా! అంత ఈజీగా వదులుతామా!
దాగి ఉండలేదు.. దూకే సమయం కోసం వేచి చూశాను..
వంటి డైలాగ్స్, సన్నివేశాల పరంగా వచ్చే కామెడీ, ఫైట్స్ అన్నీ మెప్పిస్తాయి. సిమ్రాన్, త్రిషలకు పెద్ద ప్రాముఖ్యత లేని పాత్రలు. బాబీసింహా, మేఘా ఆకాశ్, అన్వర్ అనే పాత్రలో నటించిన కుర్రాడు, మహేంద్రన్ సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
బోటమ్ లైన్: పేట... ఫ్యాన్ మూమెంట్స్ బోలెడు
Comments