తెలంగాణలో దారుణం.. హాస్పిటల్ బయటే కుప్పకూలి వ్యక్తి మృతి

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

కరోనా కారణంగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఓ ప్రైవేటు హాస్పిటల్ బయటే కన్నుమూయడం పరిస్థితికి అద్దం పడుతోంది. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌కు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజులుగా జ్వరం కారణంగా బాధపడుతున్న ఆయన హాస్పిటల్ బయటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. అతను హాస్పిటల్ బయట కుప్పకూలి పోవడానికి సంబంధించిన వీడియోలను అతని తల్లి, భార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఒక్క ఘటనే కాదు.. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నో ఘటనలు తెలంగాణలో వైద్యం పరిస్థితిని వివరిస్తున్నాయి. కరోనా పరీక్షల కోసం దాదాపు 20 రోజుల ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహించి.. రిజల్ట్ వచ్చేసరికి పుణ్యకాలం పూర్తవుతోంది. షుగర్, బీపీ, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఉన్నవారికి కరోనా వస్తే చాలా ఇబ్బందవుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం కరోనా పరీక్షలను పెంచకపోవడం దారుణమని ప్రజలు వాపోతున్నారు.

తమ పరిస్థితి విషమిస్తే బెడ్ కోసం బాధితులు వీడియో సందేశం ద్వారా మంత్రులను వేడుకుంటే తప్ప చికిత్స అందడం లేదు. బతికుంటే చాలని కార్పొరేట్ ఆసుపత్రుల వైపు సామాన్యులు చూస్తున్నారు. కానీ బెడ్ దొరికే పరిస్థితి మాత్రం లేదు. గచ్చిబౌలిలో బెడ్స్ ఏర్పాటు చేస్తామన్న సర్కార్.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఏదీ ఏమైనా తెలంగాణలో మాత్రం సామాన్యులైన కరోనా బాధితులకి వైద్యం అందని ద్రాక్షే అవుతోంది.