పవన్‌యిజం అంటే ఇదే.. లాలూచీ పనులు మానెయ్!
- IndiaGlitz, [Friday,October 25 2019]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పేచీ పెట్టుకోవడం, చంద్రబాబుతో లాలూచీ పడటమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ యిజమని మంత్రి పేర్ని నాని సెటైర్ల వర్షం కురిపించారు. మంత్రి పేర్ని నాని శుక్రవారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని రాజకీయాలకు వాడుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు..? అని నాని ప్రశ్నించారు.
పవన్‌పై కేసులు లేవు కదా!?
‘జగన్‌ను వ్యతిరేకించడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా. అధికారంలో ఉన్నా జగన్‌ను విమర్శించడమే పవన్ పనిగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపకుండా ప్రతిపక్షాన్ని తిట్టారు. ఇప్పుడేమో ప్రతిపక్షాన్ని ఒక్క మాట కూడా అనకుండా, అధికార పార్టీని విమర్శిస్తున్నారు. జగన్‌పై కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరిని ప్రశ్నించలేకపోయారని పవన్ విమర్శించారు.. పవన్‌పై కేసులు లేవు కదా ఆయన ఎవరిని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్‌పై ఎన్నికేసులు ఉన్నాయని, ఆయన కేసులు ఎవరు చెబితే పెట్టారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇచ్చారో అందరికి తెలుసు. చంద్రబాబు చెప్పిన చోట్ల పవన్ తన అభ్యర్థులను నిలబెట్టారు’ అని పవన్‌పై మంత్రి నాని సంచలన ఆరోపణలు చేశారు.
ఇకనైనా మానెయ్ పవన్..!?
‘లాలూచీ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ మార్చేస్తే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కిడ్నీ పెషేంట్ల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే పవన్ అభినందించాడు. అదే చంద్రబాబు ఏ ఘనకార్యం చేయకపోయినా ఆయనను శాలువాతో సత్కరించి అభినందిస్తాడు. రాష్ట్రం రెండేళ్లు వెనక్కి వెళ్లిందని ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ప్రోత్సహకాలు, అమ్మ ఒడి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని చురగొంటే ఇవేవి కూడా వారికి కనిపించడం లేదు. సంస్కార హీనంగా కోడికత్తి కేసు అంటూ హేళనగా మాట్లాడుతున్నారా..?. చంద్రబాబు, ఆయన పార్ట్నర్ మాట్లాడుతున్న తీరు బాధాకరం’ అని నాని కన్నెర్రజేశారు. తనపై వచ్చే విమర్శలకు కౌంటరిచ్చే పవన్.. మంత్రి వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.