అమరావతి రైతులకు హామీ ఇచ్చిన మంత్రి నాని
- IndiaGlitz, [Friday,December 27 2019]
నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు. ఈ క్రమంలో ఈ రాజధాని రైతులకు మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సమావేశంలోని వివరాలను వెల్లడించారు. ‘కొందరు జగన్ వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు.
40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చేయలేని కార్యక్రమాలను మనం చేయగలమా?. రూ.5 వేల కోట్ల అప్పుకే 575 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రూ.లక్ష కోట్ల అప్పు తెస్తే ఎన్ని వేల కోట్ల వడ్డీ కట్టాలి?. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందవద్దు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రైతులపై కక్ష గట్టే ప్రభుత్వం కాదిది. జీఎన్.రావు కమిటీని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఇప్పుడెందుకు మౌనదీక్ష చేస్తున్నారు ఆయనకే తెలియాలి. పౌరసత్వ బిల్లులో ఉన్న అపోహలను కేంద్రం తొలగించలేదు. మెజార్టీ ప్రజల ఆకాంక్షను జగన్ గౌరవిస్తారు’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.