‘సీటీమార్’ థియేటర్స్‌లో చూసే సినిమా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ట్రైలర్ చూసి యూనిట్‌కు విషెష్ చెప్పిన మెగాస్టార్ గారికి థాంక్స్. అలాగే నా స్నేహితుడు ప్రభాస్ కూడా ట్రైలర్ చూసి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడాడు. తనకు కూడా థాంక్స్. సినిమా విషయానికి వస్తే.. 2019 డిసెంబర్‌లో సీటీమార్‌ను షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. యాబై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ పెట్టారు. దాదాపు తొమ్మిది నెలలు షూటింగ్‌ను ఆపేశాం. తర్వాత నవంబర్, డిసెంబర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి పూర్తి చేశాం, రిలీజ్‌కు చేద్దాం అనుకుంటున్న తరుణంలో మరోసారి కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆగింది. ఆ సమయంలో నిర్మాతలను చూసి బాధేసింది. నా నిర్మాతలనే కాదు, ఏ నిర్మాత అయినా ఎంతో కష్టపడి, డబ్బులు పెట్టి సినిమా తీస్తాడు. ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ సినిమాపైనే ఆధారపడి ఉంటారు. ఇలాంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందే. గత నెలన్నరగా పరిస్థితులు బెటర్ అవుతున్నాయి. అందరూ బయటకు వస్తున్నారు. సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సీటీమార్ వంటి పక్కా మాస్ కమర్షియల్ సినిమా వస్తుంది. ప్రేక్షకులను ఇంటి నుంచి థియేటర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ఆదరిస్తే, మిమ్మల్ని అలరించడానికి చాలా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బడ్జెట్ అవుతుందని నేను చెబితే, కథ నచ్చిందండి చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. ఆరోజు నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించిన నిర్మాతలు శ్రీనుగారు, పవన్‌గారికి థాంక్స్. సంపత్ నందితో గౌతమ్ నంద సినిమా చేశారు. ఇది రెండో సినిమా. సంపత్ హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి ఈ సినిమా చేశాడు. డెఫనెట్‌గా మేం ఏదయితే అనుకున్నామో దాన్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం. ఇంత మంచి సినిమా చేసిన సంపత్‌కు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ సౌందర్.. బ్యాక్‌బోన్‌లా నిలిచాడు. మణిశర్మగారు అందించిన సాంగ్స్ ఇప్పటికే హిట్. ఇక ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంలో కింగ్. ఆయనకు థాంక్స్. తమన్నాకు, నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇది థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా.. తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడండి. ఎంజాయ్ చేసి ఇంటికెళతారు. అందులో డౌట్ లేదు’’ అన్నారు.
రాజమండ్రి లోక్‌సభ ఎం.పి భరత్ మాట్లాడుతూ ‘‘చిట్టూరి శ్రీనివాస్‌గారు, పవన్‌గారు కలిసి అందరితో గోల పెట్టించడానికి సీటీమార్ అనే సినిమాను తీసుకొస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సినిమా గోపీచంద్‌గారి కెరీర్‌లో మైల్‌స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ సంపత్ నందిగారికి, ఎంటైర్ టీమ్‌కు అభినందనలు. సీటీమార్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కమర్షియల్ మూవీ అని తెలుసు. ఒలింపిక్స్‌లో మనకు ఏడు మెడల్స్ వచ్చాయి. జనాభాలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. అయినా మనం టాప్ త్రీలో ఎందుకు ఉండలేకపోతున్నాం. దీనిపై నేను పార్లమెంట్‌లో కూడా మాట్లాడాను. మన నేషనల్ స్పోర్ట్స్ బడ్జెట్ కేవలం రెండు వేల కోట్లు మాత్రమే. అమెరికా, రష్యా వంటి దేశాల్లో మన కంటే యాబై, వంద రెట్ల బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూత్ మన రాజకీయాల్లోకి వస్తున్నారు. భవిష్యత్తుల్లో స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసి మరిన్ని మెడల్స్ వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సెకండ్ వేవ్ తర్వాత భారీగా వస్తున్న ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఓ పాత్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ ‘‘మా గోపీగారు సహా నిర్మాతలు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గురించి ఫ్యూచర్‌లో మాట్లాడుతాను. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మనకు స్వాతంత్య్రం రాక ముందే మన జీవితాల్లోకి సినిమా వచ్చింది. మూకీగా, టాకీ మొదలైన సినిమా తర్వాత బ్లాక్ అండ్ వైట్.. కలర్ సినిమాగా మారింది. నేల టిక్కెట్టు నుంచి బ్లాక్ టిక్కెట్టు వరకు సినిమా మారింది. చైనా తర్వాత ఎక్కువ థియేటర్స్ ఉన్న దేశమేదంటే మనదే. మన తెలుగు రాష్ట్రాల్లోనే 2800 నుంచి 3000 వరకు థియేటర్స్ ఉన్నాయి. మన దేశంలో క్రికెట్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే అది సినిమానే. అలాంటి సినిమా మనకు ఫ్రైడే పండగను తీసుకొస్తుంది. సండే వచ్చిందంటే మనకు సరదాకి సినిమా కెళ్లాలి. అన్నీ మతాలవాళ్లు వెళ్లే ఒకే ఒక గుడి థియేటర్. మన దర్గా అదే.. మన దుర్గమ్మ గుడి అదే.. మన మెదక్ చర్చి అదే. అలాంటి థియేటర్ ఈరోజు కష్టాల్లో ఉంది. ఏడాదిన్నరగా మనకు పాలాభిషేకాలు లేవు, కటౌట్స్ లేవు, పేపర్స్ చించుకోవడాలు లేవు, టిక్కెట్స్ కోసం క్యూ నిలుచుని కొట్టుకోవడాలు లేవు. మళ్లీ సినిమాలు థియేటర్స్‌లో విజృంభించాలి. అది కచ్చితంగా జరుగుతుంది. ఈ విషయాన్ని నమ్మే మా నిర్మాతలు శ్రీనుగారు, పవన్‌గారు ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా మా సీటీమార్‌ను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని ఐదు నెలలుగా ప్రాణాలు ఉగ్గబట్టుకున్నట్లు సినిమాను ఉగ్గబట్టుకుని వెయిట్ చేశారు. సెప్టెంబర్ 10న ఈ సినిమా మన ముందుకు వస్తుంది. మనకు, మన సినిమా ఇండస్ట్రీ వచ్చిన విఘ్నాలన్నీ తొలిగి అందరికీ శుభం జరగాలని, జరుగుతుందని భావిస్తున్నాం. ఈ సినిమాను చూస్తే మమ్మల్నే కాదు, ఎంటైర్ సినిమా ఇండస్ట్రీనే ఆశీర్వదించినట్లే. తప్పకుండా మీ అంచనాలను అందుకునే సినిమా చేశాం. తప్పకుండా అందరూ మెచ్చుకునే సినిమా చేశానని అనుకుంటున్నాను. ఇది దంగల్, చక్ దే ఇండియా తరహాలో సీటీమార్ కేవలం స్పోర్ట్స్ సినిమా కాదు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మాస్ కమర్షియల్ మూవీ. సేవ్ సినిమా’’ అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘‘సీటీమార్’ సినిమా గ్యారంటీ హిట్. చిట్టూరి శ్రీను, నేను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. ఒకేసారి వచ్చాం, ఒకే సినిమాతో మొదలయ్యాం. చిట్టూరి శ్రీను ఒక్కొక్క క్రాఫ్ట్‌లో పనిచేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి యూ టర్న్ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారారు. వెంటనే నిర్మాతగా తొందర పడకుండా సీటీమార్ అనే మరో మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. టైటిల్ వింటుంటేనే మణిశర్మగారిని గుర్తుకు తెచ్చుకోవాలి. సౌండ్ వింటుంటే లోలోపల స్టెప్ వేసుకునేలా ఉంది. శ్రీను ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే, లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేనితో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ఆయన అలాగే ముందుకు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటే అందరం బాగుంటారు. రీసెంట్‌గా జరిగిన ఒలింపిక్స్‌లో సింధు దగ్గర నుంచి చాలా మంది అమ్మాయిలు మన దేశం పేరు నిలబెట్టారు. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు... అధికులు కూడా. వాళ్లు సాధిస్తారు కూడా. అలాంటి అమ్మాయిలపై స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసిన శ్రీనుని, డైరెక్టర్ సంపత్‌ని, హీరో గోపీచంద్‌ను అభినందించాలి. గోపీచంద్ పుట్టినప్పటి నుంచి ఫైటరే. ఎందుకంటే.. ఆయన టి.కృష్ణ అనే మహానుభావుడి కొడుకు. కమర్షియల్ సినిమాలు చేసే సత్తా ఉన్న కూడా, నాకు సామాజిక స్పృహ ఉంది. సోసైటీపై నాకొక బాధ్యత ఉంది. ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. అనే సిద్ధాంతాన్ని విడిచి పెట్టకుండా దాన్ని ఫాలో అవుతూ, సినిమాలు చేశారు. అంత గొప్ప మనిషి కొడుకే మన గోపీచంద్. అంతా ఉన్నా కూడా గోపీచంద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి అన్నీ ఒడిదొడుకులే. కానీ గోపీచంద్‌కి మళ్లీ లేస్తాననే నమ్మకం ఉంది. కాబట్టి ఎక్కడా డిసప్పాయింట్ కాకుండా ముందుకు కదిలాడు. గోపీచంద్ హీరోలా, విలన్‌గా చేసి ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. సీటీ కొట్టి.. సీటీమార్‌తో హిట్ కొడతాడు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి నిర్మాతగారితో మాట్లాడుతున్నాను. ఆయన సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటనే దాని గురించి రెండు లైన్స్‌లో చెప్పారు. వినగానే చాలా బావుందనిపించింది. అదే విషయం ఆయనకు చెప్పాను. ట్రైలర్ చూసినప్పుడు నా నమ్మకం నిజమవుతుందనిపించింది. సినిమాలో పాజిటివ్ మోడ్ ఉంది. టి.కృష్ణగారు చేసిన ప్రతిఘటన తమిళంలో అనువాదమై విడుదలైనప్పుడు నేను చదువుకునేవాడిని. ఆ సినిమా చూశాను. కృష్ణగారు ఎంతో గొప్ప రైటర్, డైరెక్టర్. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఎన్నో విజయాలను సాధించాలి. సంపత్ నంది మేకింగ్ బావుంది. తమన్నాకు, సౌందర్ రాజన్‌గారు సహా అందరికీ ఆల్ ది బెస్ట్. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరిగారితో రామ్ హీరోగా సినిమా చేస్తున్నాను. ఇప్పటికే ముప్పై రోజులు షూటింగ్ పూర్తయ్యింది. ఎన్నో రోజుల నుంచి తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. మంచి ప్రొడక్షన్స్ హౌస్‌తో జర్నీ చేస్తున్నాను. అందరికీ థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘జనాలు ఇప్పుడు ధైర్యంగా బయట తిరుగుతున్నారు. అలాగే ఈ సినిమాను చూడటానికి థియేటర్స్‌కు వస్తారని ఆశిస్తున్నాం. నిర్మాతలు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. గోపీచంద్‌గారు నాలాంటి డైరెక్టర్స్‌ను ఎంతో మందిని ఇండస్ట్రీకి ఇచ్చాడు. లక్ష్యం సినిమాతో నన్ను డైరెక్ట్ చేసిన గోపీచంద్‌గారు నాకెప్పుడూ స్పెషలే. రుణం తీర్చుకునే సందర్భాలు చాలా తక్కువగానే వస్తాయి. ఆయనతో పనిచేసిన లౌక్యం కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ రెండు సినిమాలను మించిన పెద్ద కథ రెడీ అయ్యింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సంపత్ నంది నాకు చాలా మంచి స్నేహితుడు. కష్టపడి సినిమా తీయడమే కాదు, కమర్షియల్ యాంగిల్లో సినిమాను తీస్తుంటాడు. కమర్షియల్ సినిమాను తీయడం చాలా కష్టం. సీటీమార్‌లో కబడ్డీ నేపథ్యం కోసం అమ్మాయిలను ఎంపిక చేసుకుని చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. వినాయక చవితికి వస్తున్న ఈ సినిమా అన్ని విఘ్నాలను తొలగించుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లాంటి సినిమా సీటీమార్. సంపత్ నంది, చిట్టూరి శ్రీను మంచి ఫ్రెండ్స్. ఆడియెన్స్‌కు, థియేటర్స్‌కు మంచి ఎనర్జీ ఇచ్చే సినిమా ఒకటి రావాలని ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో సీటీమార్‌ను పండగరోజున ముందుకు తెస్తున్నారు. ఓ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తోంది. గోపీచందన్నతో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాను. అలాంటి వ్యక్తితో పనిచేయడం నా అదృష్టం. సీటీమార్ ఎనర్జిటిక్ మూవీ. గోపీచంద్‌గారిని ఒకలా చూశాం. ఇకపై మరోలా ఉంటుంది. అందరూ గర్వపడేలా సినిమాలను లైన్‌లో పెట్టుకున్నారు’’ అన్నారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ‘‘గోపీచంద్, సంపత్ నంది, శ్రీనివాస్.. వీరందరూ కలిసి చేసిన సీటీమార్ మా సినిమాగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీరందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్లే. సంపత్ నంది చాలా కాన్ఫిడెంట్‌గా సినిమాను తీశాడు. ఇక గోపీచంద్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌గారి ఈవెంట్స్‌కు నేను వెళితే, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే సెంటిమెంట్‌తో ఇక్కడకు వచ్చాను. గోపీచంద్‌లో ఓ హానెస్ట్ ఉంటుంది. అదే ఆయన్ని ఇంత పెద్ద స్టార్‌ని చేసింది. మా చిత్తూరు శీను చేసిన సినిమా ఇది. తనతో, సంపత్‌నందితో ఉన్న ఫ్రెండ్ షిప్ కోసం ఈ వేడుకకి వచ్చాను. ఈ పాండమిక్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో థియేటర్స్ ఫుల్ అవుతుందని, కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరోయిన్ అప్సర రాణి, మంగ్లీ తదితరులు పాల్గొని ‘సీటీమార్’ సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout