YS Jagan: చెప్పాడంటే చేస్తాడంతే.. జగన్ ముద్దు.. బాబు వద్దు అంటున్న జనం..
- IndiaGlitz, [Saturday,April 27 2024]
రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. చేయగలిగిందే చెప్పాలి. అది నాయకుడి లక్షణం. అంతేకానీ తన రాజకీయ స్వార్థం కోసం అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు రేపకూడదు. పాలు ఇవ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏమి లాభం అన్నట్లు.. అమలు చేయని హామీలు మ్యానిఫెస్టోలో ఎన్ని ఉంటే ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తా... చేసేదే చెబుతా... విశ్వసనీయతే నా ప్రాణం అంటారు సీఎం జగన్. ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ ముఖ్యమంత్రి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆకాశాన్నంటే హామీలు లేవు.. ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ... ఎక్కడెక్కడ ఏయే వర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి, రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి. ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం తన వద్ద ఉండదని జగన్ తెలిపారు.
చేయగలిగిందే చెబుతా.. చెప్పిందే చేస్తా అని సీఎం జగన్ కుండబద్ధలు కొట్టారు. ఆయన చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉండటంతో చేయగలిగిన హామీలనే చెప్పారు. ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తారని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. అదే జగన్ అయితే ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. మొత్తానికి వైసీపీ మ్యానిఫెస్టో సింపుల్‌గా స్పష్టంగా జనాల్లోకి బలంగా వెళ్లింది. ప్రస్తుతం ఇస్తున్న పథకాలనే సరిగ్గా అమలు చేస్తే చాలు అని ప్రజలు చర్చించుకోవడం జగన్ పట్ల వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.