శభాష్ పోలీస్ అంటూ పూల వర్షం
- IndiaGlitz, [Friday,December 06 2019]
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి దగ్గరే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వి.. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు.
పూల వర్షం.. పండుగే!
అయితే ఈ ఘటన జరిగిందని తెలుసుకున్న జనాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొన్ని వేలమంది జనాలు అక్కడికి చేరుకుని పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు మరోవైపు అక్కడున్న పోలీసులపై ప్రజలు పూల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. పోలీసులకు స్వీట్లు తినిపించిన జనాలు.. పండుగ చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఘటనాస్థలిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీస్ జిందాబాద్.. జై పోలీస్.. జైజై పోలీస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
నిందితుల తల్లిదండ్రుల రియాక్షన్!
ఇవన్నీ ఒక ఎత్తయితే బాధితురాలి ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. ఆడపడుచులు.. పోలీసులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా దిశ సోదరి మీడియా మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు మా బిడ్డ ఆత్మకు శాంతి కలిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోయిన తన కుమార్తె తిరిగిరాదని.. ఆడవారిపై చేయి వేయాలంటే భయపడేలా చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు.