18 ఏళ్ల పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ దశల వారీగా ప్రభుత్వం టీకాను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కరోనా టీకా కార్యక్రమం పరిధిలోకి కేంద్రం 18ఏళ్లు పైబడిన వారిని కూడా తీసుకువచ్చింది. మే ఒకటి నుంచి వారికి టీకాలు పంపిణీ చేయనుంది. దానిలో భాగంగా వారంతా ఏప్రిల్ 28 నుంచి కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.
అంటే టీకా పంపిణీ ప్రారంభానికి 48 గంటల ముందు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులభం. మొదట కొవిన్ పోర్టల్(cowin.gov.in)లో లాగిన్ చేసి, మన మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ వెంటనే ఏ మొబైల్ నంబర్‌నైతే నమోదు చేశామో ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్ ఓపెన్ అవుతోంది. దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని మనమే ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
పిన్‌కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటిలో మనకు దగ్గరలో ఉన్న టీకా కేంద్రాన్ని ఎంచుకుని.. దాని ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ఇంకెందుకు.. వెంటనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments