YS Jagan:ఏ సర్వే అయినా రిజల్ట్ ఒక్కటే .. జగన్‌కే పట్టాభిషేకం, పోల్ స్ట్రాటజీ సంస్థది అదే మాట..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారాన్ని సంపాదించాలని టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఓ 30 నుంచి 40 స్థానాల్లో గెలిచి కింగ్ మేకర్ కావాలని జనసేన కూడా ఎత్తులు వేస్తోంది. వీటితో పాటు జగన్‌ను ఓడించడానికి బీజేపీ, జనసేనతో కలిసి పొత్తులతో వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఓ వైపు.. విపక్షాలన్నీ మరోవైపు బరిలో దిగుతూ..ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించాయి. అన్ని పార్టీలు క్షేత్ర స్థాయి నుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ముందున్న జగన్ :
అందరికంటే ఎన్నికల సమరంలో దిగేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 టార్గెట్ ఫిక్స్ చేసి నేతలను ప్రజల్లో వుండేలా గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మంచి ఫలితాలే వస్తున్నాయి. దీని తర్వాత జగనన్నకు చెబుదాం, నువ్వే మా నమ్మకం జగనన్న, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలతో ఆయన ముందుకు సాగారు. విపక్షానికి వస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తుండగా.. లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా తన బలాన్ని , బలగాన్ని చూపిస్తూ.. పోటీలో నేను కూడా వున్నానని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనే చర్చ నడుస్తోంది.
సర్వే ఏదైనా జగనే సీఎం:
కానీ.. ఎన్నికల సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థలు సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఏ సంస్థ సర్వే నిర్వహించినా జగన్ పేరే మార్మోగుతోంది. ఇప్పటికే టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో మరో మాట లేకుండా జగనే సీఎం అవుతారని తేలింది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు గెలిచి.. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలుస్తుందని అంచనా వేసింది.
వైసీపీకి 49 శాతం ఓట్లు వస్తాయంటున్న సర్వే :
తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో 2019 నాటి ఫలితాలే రిపీట్ అవుతాయని తేలింది. విపక్షాలన్నీ విడివిడిగా వచ్చినా, లేక మూకుమ్మడిగా వచ్చినా జగనే సీఎం అవుతారని... వైసీపీకి ఎవరూ ఊహించనంత భారీ మెజార్టీ వస్తుందని సర్వే అంచనా వేసింది. వైసీపీకి దాదాపు 49 శాతం ఓట్లు వస్తాయని.. ప్రతిపక్ష టీడీపీకి 37 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. జనసేన పార్టీకి 7 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. టిడిపి- జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు 10 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ వైపు మొగ్గు చూపగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ పాలన బాగుందని 56 శాతం మంది అంగీకరించగా.. 22 శాతం మంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని , 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. 3 శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.
సంక్షేమ పథకాల అమలుతో జగన్‌పై విశ్వసనీయత :
వైసీపీని ఈ స్థాయిలో ప్రజలు విశ్వసించడానికి కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే కారణమని అంగీకరించాల్సిందే. నవరత్నాల పేరుతో కనివినీ ఎరుగని రీతిలో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అస్తవ్యస్తంగా వున్నా తన బాధలేవో పడుతూ చెప్పిన టైంకి, చెప్పిన వర్గానికి బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నారు జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ఆయన సగర్వంగా ప్రజలకు చెబుతున్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించడం లేదని సర్వేతో తేలిపోయింది. గతంలో ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆయన్ను మరోసారి నమ్మడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే పొత్తులతోనే జగన్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్‌తో వెళ్దామంటే ఆయన నిలకడలేని తత్వం తనను కూడా ముంచేస్తుందేమోనని చంద్రబాబు భయపడుతున్నారు. ఇక బీజేపీ నుంచి పొత్తులపై ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout