న్యూఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్.. విమర్శలపాలవుతున్న ఆబ్కారీ శాఖ
- IndiaGlitz, [Thursday,December 31 2020]
ఓ వైపు కరోనా తుడిచిపెట్టుకు పోయింది లేదు.. పైగా కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ స్ట్రెయిన్ తాజాగా తెలుగు రాష్ట్రాలను సైతం తాకింది. అసలే ఈ కొత్త మహమ్మారికి వ్యాప్తి చాలా ఎక్కువ. న్యూ ఇయర్ అంటేనే.. క్లబ్‌ల్లో.. పబ్‌ల్లో మాత్రమే ఉంటుందని భావించే నగర ప్రజానీకం... ఎక్కడ బీభత్సంగా తాగేసి లేని పోని తలనొప్పులు తెచ్చిపెడతారోనని పోలీసు బాసులు ఇప్పటికే అలర్ట్ అయిపోయారు. న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం.. మందుబాబులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ డ్రంక్ డ్రైవ్‌లో దొరికితే సినిమా చూపిస్తామని సీపీ సజ్జనార్ ఇప్పటికే చెప్పేశారు. కానీ ఆబ్కారీ శాఖకు మాత్రం ఇవేమీ పట్టలేదు. ‘తాగండి.. తూగండి’ అన్నట్టుగా అర్థరాత్రి 12 గంట వరకూ బార్ల తలుపులను బార్లా తెరిచేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఆబ్కారీ శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి, 1 గంట వరకూ బార్లలో మద్యాన్ని అందించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని అందించవచ్చని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇన్‌హౌజ్(ఇళ్లలో) పర్మిట్లు తీసుకునేవారికి కూడా ఒంటి గంట నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఎక్సైజ్ శాఖ విపరీత ధోరణి చర్చనీయాంశంగా మారింది. దేశంలో నూతన సంవత్సర వేడుకలపై నిఘా పెట్టాలని, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. మరోవైపు తెలంగాణలో కూడా తెలంగాణలో కరోనా మృతులకు నివాళిగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవద్దని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు గడల శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు.
పండగలు, వేడుకల్లో పాల్గొన్న తర్వాతే సినీ నటులకు పాజిటివ్ వచ్చిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా వేడుకలకు దూరంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా సూచించారు. మరోవైపు రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతుల్లేవని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిసెంబరు 31న మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లను టెర్రరిస్టులతో సమానమన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిపోతే పదేళ్ల జైలు శిక్ష వేయించేందుకు వెనుకాడబోమన్నారు. ఓ వైపు ఆరోగ్యశాఖ.. మరోవైపు పోలీస్ శాఖ.. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఆబ్కారీ శాఖ తీరు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఎవరెలా పోతే నాకేంటి..? ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా న్యూ ఇయర్‌ను టార్గెట్ చేసింది.