Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు. తర్వాత ప్రజలకు కృతజ్ఞత సభలో తొలి ప్రసంగం చేశారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా మానవ హక్కులకు భంగం కలిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పదేళ్లగా రాష్ట్రానికి పట్టిన చీడ పోయిందని.. ఇక నుంచి ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని పేర్కొ్న్నారు. తాము పాలకులం కాదు.. ప్రజా సేవకులమని చెప్పారు.
పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా ప్రజా భవన్‌కు వచ్చి తెలియజేయవచ్చని చెప్పుకొచ్చారు. తమను నమ్మి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరస్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్టాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments