ప్రతి శుక్రవారం థియేటర్స్ సినిమాలు సందడి చేస్తుండేవి. కానీ కరోనా దెబ్బకు థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ కారణంగా కొందరు నిర్మాతలు ఓటీటీలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అమృతారామమ్, గులాబోసితాబో, పెన్మగళ్ వందాల్ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఆ క్రమంలో ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేశ్ గర్భవతి పాత్రలో నటించడం విశేషం. అసలు పెంగ్విన్ టైటిల్‌కు, కీర్తిసురేశ్‌కు ఉన్న లింకేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం
కథ:
రిథమ్(కీర్తిసురేశ్), గౌతమ్(రంగరాజ్) భార్యాభర్తలు. రిథమ్ గర్భవతి. ఆమెకు పురగులను చూస్తే మానసికంగా బలహీనమై కళ్లు తిరిగిపడిపోతుంటుంది. చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన రిథమ్‌కు అలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. పాత జ్ఞాపకాలు లేకుండా చూసుకోవాలని డాక్టర్ సలహా ఇస్తుంది. వారుండే ప్రాంతంలోని సరస్సు దగ్గరకు వెళ్లవద్దని కూడా సూచిస్తుంది. అయితే రిథమ్ కావాలనే సరస్సు దగ్గరకు వెళుతుంది. అక్కడ నుండి ఆమె గతంలోకి వెళుతుంది. ఆరేళ్ల ముందు రఘ(లింగ)ను పెళ్లి చేసుకున్న రిథమ్‌కు అజయ్ అనే పిల్లాడు పుడతాడు. ఓరోజు స్కూల్ నుండి వస్తున్న అజయ్‌ను ఎవరో కిడ్నాప్ చేస్తారు. రిథమ్ నిర్లక్యం వల్లే అజయ్ కిడ్నాప్‌కు గురయ్యాడని భావించిన రఘు ఆమెకు విడాకులు ఇస్తాడు. ఇవన్నీ రిథమ్ గతం. అయితే అజయ్ జ్ఞాపకాలను రిథమ్ మరచిపోలేకపోతుంది. అసలు అజయ్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? అజయ్ ఏమవుతాడు? అసలు అజయ్‌తో పాటు ఇంకెంత మంది పిల్లలు కిడ్నాప్ అవుతారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ చిత్రాలు కొన్ని ప్రేక్షకాదరణను పొందాయి. దాంతో అలాంటి థ్రిల్లర్ జోనర్ చిత్రాల కోవలో రూపొందిన చిత్రం ‘పెంగ్విన్’. థ్రిల్లర్ సినిమాల్లోని అసలు కిటుకంతా స్క్రీన్‌ప్లేలో ఉంటుంది. అలాగే కెమెరా పనితనం, సంగీతం, నేపథ్య సంగీతం దర్శకత్వానికి ప్రధానబలంగా చేకూరాలి. అలాగే సస్పెన్స్ పాయింట్‌ను చివరి వరకు చక్కగా క్యారీ చేయగలగాలి. ఇలాంటి అంశాలతో ప్రేక్షకులను చివరి వరకు కూర్చో పెట్టగలిగితే సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారనడంలో సందేహం లేదు. పెంగ్విన్ విషయానికి వస్తే థ్రిల్లింగ్‌గా ప్రేక్షకుడి మదిలో ప్రశ్నలు రేగేలా చేయడం వరకు బాగానే ఉంది. కానీ.. సన్నివేశాలకు యాడ్ చేసిన ఎమోషనల్ అంశాలు బోరింగ్‌గా ఉన్నాయి. ప్రేక్షకుడి సహనానికి ఇవి పరీక్ష పెడతాయి. సినిమాలో ఓ మాస్క్‌మ్యాన్ చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తుంటాడు అనే పాయింట్ ప్రారంభంలోనే రివీల్ అవుతుంది. అయితే ఈ అంశం చుట్లూ సినిమాను రన్ చేయించడంలో గ్రిప్పింగ్‌గా సన్నివేశాలను మలచడంలో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఫెయిల్ అయ్యాడు.
ఫస్టాఫ్ ఓకే.. ఇక దాన్ని కూడా కన్‌ఫ్యూజింగ్‌గా చెప్పడానికి ప్రయత్నించారు. మరి స్లో నెరేషన్ అనిపించింది. సరే! థ్రిల్లరే కదా.. అని సర్దుకు పోదాం అనుకుంటే సెకండాఫ్‌లో ఆసక్తి అసలు లేకుండా పోయింది. సినిమాలో హీరోయిన్ ఫీలయ్యే ఎమోషన్‌కు ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అంత గొప్పగా ఏమీ లేదు. ఇక హీరోయిన్ కొడుకు విలన్ కిడ్నాప్ చేయడం వెనుక కారణం సిల్లీగా అనిపిస్తుంది. కిడ్నాపులు, హత్యలు ఇంత సిల్లీ రీజన్స్‌కే చేసేస్తారా? అనిపిస్తుంది. నటీనటుల పరంగా తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేశ్ మాత్రమే సుపరిచితురాలు. మిగతా అందరూ తమిళానికి చెందినవారే. కీర్తిసురేశ్ నటన పరంగా ఆమె పాత్రను చక్కగా క్యారీ చేసింది. మిగిలిన వారందరూ వారి పాత్రల్లో నటించారు. ఈశ్వర్ కార్తీక్ సినిమాను ఆసక్తికరంగా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. పాటలు ఎఫెక్టివ్‌గా లేదు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ చాలా బావుంది. స్లో నెరేషన్.. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండుంటే బావుండేది.
బోటమ్ లైన్: పెంగ్విన్.. కీర్తికి వచ్చేదేమీ లేదు
Comments