బాహుబలి అయినా...పెళ్లి చూపులు అయినా ఆడియన్స్ చూసేది అదే - నిర్మాత రాజ్ కందుకూరి
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, రీతువర్మ, నందు ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు. డి.సురేష్ బాబు సమర్పణలో పెళ్లి చూపులు చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరితో ఇంటర్ వ్యూ మీకోసం...
పెళ్లిచూపులు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
సురేష్ బాబు గారు ఓసారి ఫోన్ చేసి తరుణ్ భాస్కర్ కథ చెప్పాడు నాకు నచ్చింది ఓసారి విను అని అన్నారు. తరుణ్ భాస్కర్ గతంలో తెలంగాణ స్లాంగ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. ఆ షార్ట్ ఫిల్మ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే...ఎనిమిది నెలల క్రితం తరుణ్ భాస్కర్ ఈ కథ చెప్పాడు. కథ విన్న వెంటనే నాకు బాగా నచ్చేసింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే...మైండ్ బ్లోయింగ్. విన్న వెంటనే నచ్చడంతో మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
పెళ్లి చూపులు కథ ఏమిటి..?
ఇంజనీరింగ్ చదివి ఎలాంటి లక్ష్యం లేని అబ్బాయి, జీవితం పై పూర్తి అవగాహన అమ్మాయి వీరిద్దరికి పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి కథ ప్రారంభం అవుతుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరి ఇది. ఇప్పుడు మెసేజ్ చెబితే ఎవరూ చూడరు. అందుకనే ఎంటర్ టైన్మెంట్ తో మిక్స్ చేసి ఈ కథ చెప్పాం. యూత్ చూడాల్సిన సినిమా.
సురేష్ బాబుకు ఈ కథ నచ్చినప్పుడు ఆయనే ప్రొడ్యూస్ చేయచ్చు కదా..? మీ దగ్గరకి పంపడానికి కారణం ఏమిటి..?
ఇదే ప్రశ్న నేను సురేష్ బాబు గార్ని అడిగాను. ఇలా అడిగితే ఆయన ఏమన్నారంటే...ప్రస్తుతం ప్రొడ్యూస్ చేయడం లేదు. వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాను. మీరు ఈ సినిమా నిర్మిస్తే పూర్తి సపోర్ట్ అందిస్తాను అని చెప్పారు. కథ మీద నమ్మకంతో ధైర్యంగా ఈ సినిమాని తీసాను. సురేష్ బాబు గారు చెప్పినట్టే ఈ సినిమా విషయంలో ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు.
షార్ట్ ఫిల్మ్ తీసిన తరుణ్ భాస్కర్ తో..అదీ కొత్తవాళ్లతో సినిమా తీయడం రిస్క్ అనిపించలేదా..?
చాలా మంది మీరు అన్నట్టే అన్నారు. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నావ్. అదీ కూడా 2 కోట్లు బడ్జెట్ తో ఏ నమ్మకంతో సినిమా తీస్తున్నావ్ అని అడిగారు. చాలా మంది నన్ను నిరుత్సాహపరిచేలా మాట్లాడారు. ఎవరు ఎలా మాట్లాడినా నాకు కథ మీద నమ్మకం ఉంది. బాహుబలి అయినా అదే రెండున్నర గంటల్లో చూపించాలి. అదే 150 రూపాయలు టికెట్. పెళ్లి చూపులు అయినా అదే రెండున్నర గంటల్లో చూపించాలి దీనికి అంతే టికెట్. ఇప్పుడు ఆడియన్స్ సినిమాలో ఏ హీరో ఉన్నాడు అని చూడడం లేదు కంటెంట్ ఉందా లేదా అనేదే చూస్తున్నారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాని నిర్మించాను. ఒక మంచి సినిమా తీసాననే తృప్తి ఉంది.
మీరు ఎక్కువుగా వేరే ప్రొడ్యూసర్స్ తో కలిసి సినిమాని నిర్మిస్తుంటారు కారణం ఏమిటి..?
నేను ఇప్పటి వరకు 10 సినిమాలు నిర్మించాను. తొలి ప్రయత్నంగా గౌతమ బుధ్ద అనే సినిమాని నిర్మించాను. ఈ సినిమాకి నంది అవార్డ్ కూడా వచ్చింది.ఈ సినిమాని మా నాన్నగారి కోరిక మేరకు నిర్మించాను.ఆతర్వాత నేను సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించాను. మధుర శ్రీథర్ తో కలిసి సినిమా నిర్మించాను. అలాగే రీసెంట్ గా గిరిథర్ తో కలిసి సినిమా నిర్మించాను. నేను వేరే నిర్మాతతో కలిసి సినిమా చేస్తే...రిస్క్ అనేది తగ్గుతుంది అనేది నా ఫీలింగ్.
నిర్మాతగా మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?
ఆకలిరాజ్యం, సాగర సంగమం...చిత్రాల్లా ఎప్పటికీ గుర్తుండే సినిమాలు నిర్మించాలనేది నా కోరిక. అలాంటి మూడు సినిమాలు చేస్తే చాలు అనకుంటున్నాను. పెళ్లి చూపులు సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నాను. పెళ్లి చూపులు నిర్మాత అని నాకు పేరు తీసుకువచ్చే సినిమా అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు.
మీరు గోల శీను అనే సినిమాని డైరెక్ట్ చేసారు కదా...మళ్లీ మీ డైరెక్షన్ లో సినిమా ఎప్పుడు..?
నవంబర్ నుంచి నా డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పెళ్లి చూపులు అనే సినిమాని నిర్మించారు కదా...షార్ట్ ఫిల్మ్స్ తీసి ఈ రంగంలోకి రావాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి..?
టాలెంట్ ఉన్న వారికి నా ప్రొత్సాహం ఎప్పుడూ ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్లు ఎవరైనా సరే..ఇంట్రస్ట్ ఉంటే నాకు కథ చెప్పచ్చు. కథ నచ్చితే తప్పకుండా అవకాశం ఇస్తాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తరుణ్ భాస్కర్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అలాగే షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ తో ఓ మూవీ చేయనున్నాను. 2017లో పెద్ద హీరో బిగ్ బడ్జెట్ మూవీ చేయాలనే ప్లాన్ ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout