గో సంరక్షుడు, గాయకుడు పెంచల్ దాస్‌ను సన్మానించిన పవన్
- IndiaGlitz, [Wednesday,March 10 2021]
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షుడు చాంద్ బాషాను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సన్మానించారు. దాదాపు 400 ఆవులతో చాంద్ బాషా గోశాలను నిర్వహిస్తున్నారు. చాంద్ బాషా గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ని హైదరాబాద్ పిలిపించుకొని మరీ సన్మానించారు. ఆయన చేస్తున్న సేవలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ... “ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను హైదరాబాద్ పిలిపించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. గోశాలకు ఎలాంటి సాయం కావాలన్న వెంటనే అడగమని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. గోమూత్రం, ఆవుపేడతో భూసారం పెంచే కషాయం, ఎరువులు తయారు చేస్తున్నామని తెలిసి అభినందించారు. ఈ విధమైన ప్రోత్సాహం నాలాంటివారికి చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది అన్నారు.
అనంతరం పవన్‌ను గీత రచయిత, గాయకుడు పెంచల్ దాస్.. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి కలిశారు.పెంచల్ దాస్ రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై పెంచల్ దాస్‌తో కాసేపు పవన్ ముచ్చటించారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సైతం పాల్గొన్నారు. అనంతరం పెంచల్ దాస్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు.