Pawan:చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. అధికార ప్రతినిధులకు పవన్ సూచన
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసినా, బీజేపీతో కలిసినా, టీడీపీతో కలిసినా రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే అనే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేనాని మాట్లాడుతూ చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని గుర్తు చేశారు. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని ఆదేశించారు.
సినిమాలు, కుటుంబసభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించవద్దు..
అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలన్నారు. ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు పై లోతుగా అధ్యయనం చేయండని చెప్పారు. సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికి పంపడమో దానిపై హడావిడి చేయడమో వద్దని పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దన్నారు. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలని.. తన సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దని కోరారు.
జీరో బడ్జెట్ రాజకీయాలని ఎప్పుడూ చెప్పలేదు..
జీరో బడ్జెట్ రాజకీయాలు అని తానెప్పుడూ చెప్పలేదని.. కానీ అలా ప్రచారం చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి మాత్రమే.. అంతేగానీ కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి కాదన్నారు. ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ తాను వ్యతిరేకం కాదని వ్యక్తిగతంగా వారు తనను దూషించినా శత్రువుగా పరిగణించనని చెప్పారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధుల పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తుచేశారు. పార్టీ అభిప్రాయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది అధికార ప్రతినిధులేనని.. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి వచ్చే నెలలో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments