Pawan:సోదరి భువనేశ్వరిని అవమానించిన వంశీని ఓడించండి: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తనకు సోదరి లాంటి వారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు. గన్నవరంలో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత వల్లభనేని వంశీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంశీకి కూటమి మద్దతుదారులు పొరపాటును కూడా ఓటేయొద్దని.. అతడు ఆడవాళ్లను అవమానించే వ్యక్తి అని మండిపడ్డారు.
"2014లో నేను కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ వల్లభనేని వంశీ ఏం చెప్పారో నాకు గుర్తుంది. మీరు ప్రచారం చేయడం వల్ల ఎప్పుడూ ఓట్లు పడని ప్రాంతాల్లో కూడా నాకు ఓట్లు పడ్డాయి అని వంశీ మనస్ఫూర్తిగా చెప్పారు. ఆయన మంచి నాయకుడు, ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి అనుకున్నాను... కానీ ఆ తర్వాత ఆయన మారిపోయారు.
విభేదాలు ఎవరికుండవు? నేను కూడా చంద్రబాబుతో విభేదించాను, చింతమనేని ప్రభాకర్ తో విభేదించాను. ఎక్కడా కూడా విధానపరంగానే విభేదించాం తప్ప, అంతకుమించి వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఎంపీ ఓటు జనసేన అభ్యర్థి బాలశౌరికి వేసి, ఎమ్మెల్యే ఓటు నాకు వేయండి అని వల్లభనేని వంశీ గన్నవరం ఓటర్లను అడుగుతున్నట్టు నాకు తెలిసింది. అయితే, ఓటర్లు ఆ సూచనను పాటించకూడదు. జనసేన పార్టీ కూడా కూటమిలో ఉన్నందున అది సమంజసం కాదు.
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన పాటలను కూడా నేను నా సినిమాల్లో పెట్టుకున్నాను. కానీ, అటువంటి మహనీయుడి కుమార్తె (నారా భువనేశ్వరి)ని వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడిన తీరు నాకు చాలా బాధ కలిగించింది.
చంద్రబాబుతో, లోకేశ్ తో విభేదాలు ఉండడం వేరు... కానీ భువనేశ్వరి గారిని కించపరిచేలా మాట్లాడడం నాకు బాధ కలిగించింది. భువనేశ్వరి గారిని అంటే నా సోదరిని అన్నట్టే. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ జనసేన. నాయకుల మధ్య ఎన్నో విభేదాలు ఉండొచ్చు... జగన్ తోనూ విభేదాలు ఉన్నాయి... కానీ వారి అర్ధాంగిని మాత్రం ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు.
వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు ఓటేస్తే... స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, మన సోదరిని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకచోట ఆడవాళ్లను అగౌరవపరిచన వాళ్లు ఎక్కడైనా ఆడవాళ్లను అలాగే కించపరుస్తారు. అందుకే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యం" అని పవన్ కల్యాణ్ వివరించారు.
ఈ సందర్భంగా వేదికపై ఉన్న దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు బాగా ఇష్టమైన నాయకుడు ప్రభాకర్ అని పవన్ వెల్లడించారు. "ఎవరు స్నేహితులు అవుతారు? గొడవ పెట్టుకున్న వాళ్లే స్నేహితులు అవుతారు. దెందులూరు నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే నేను గెలిపిస్తాను అని చెప్పిన వ్యక్తి చింతమనేని. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా నాకు అందంగా ఉంటుంది... ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది. ఏమంటారు ప్రభాకర్ గారూ? మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది. గొడవతో మొదలైన స్నేహం చాలా బలంగా ఉంటుందని చెబుతారు" అంటూ పవన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments