ర‌జ‌నీ, క‌మ‌ల్ చిత్రాల‌కు ప‌వ‌న్ స్వ‌ర‌క‌ర్త‌

  • IndiaGlitz, [Saturday,June 02 2018]

తమిళ అనువాద చిత్రం ‘3’తో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన అనిరుధ్‌.. స్ట్ర‌యిట్ ఫిల్మ్‌ ‘అజ్ఞాత‌వాసి’తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరు లెజెండరీ హీరోల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్‌ల‌ను కొట్టేసారు ఈ యువ సంగీత సంచ‌ల‌నం. ఆ వివరాల్లోకి వెళితే.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కబోతున్న ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’)కి సంగీతం అందించే అవకాశాన్ని దక్కించుకున్నారు అనిరుధ్‌.

1996లో కమల్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’)కి ఇది సీక్వెల్. ఆ సినిమాకి డబుల్ ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీతం అందించగా.. ఇప్పుడు ఈ సీక్వెల్‌కు అనిరుధ్‌ సంగీతం అందించడం విశేషం. మరోవైపు.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకి కూడా సంగీతాన్ని అందించనున్నారు అనిరుధ్‌. ఇలా.. ఒకే స‌మ‌యంలో ర‌జ‌నీ, క‌మ‌ల్ చిత్రాల‌కు ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం అనిరుధ్ అదృష్ట‌మ‌నే చెప్పాలి. మ‌రి.. ఈ సినిమాల‌తో అనిరుధ్ త‌న స్థాయిని మ‌రింత‌గా పెంచుకుంటాడేమో చూడాలి.