Pemmasani: రాసిపెట్టుకోండి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు.. ప్రభుత్వానికి పెమ్మసాని సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
తాను పుట్టిన ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, వెనిగండ్ల, పెదకాకాని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో పెదకాకాని మండలం పసుపుమయమైంది. రహదారులు కానరాని విధంగా పూల వర్షం కురిపించింది. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు.
పెమ్మసాని ప్రచారం ఇలా అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా ప్రధాన కూడలికి వచ్చేసరికి ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచి నిలిచిపోయింది. కాగా అభిమానుల అండ ఉన్న పెమ్మసాని మొబైల్ లైట్ల వెలుగుల మధ్యనే తన ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు. అభిమానులు, కార్యకర్తలు చైతన్య రథానికి చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ప్రచార కార్యక్రమం ముందుకు సాగడానికి సహకరించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ‘విద్యుత్ కట్ చేసినంత మాత్రాన మా ప్రయాణం ఆగదు బ్రదర్. ప్రజా విప్లవ కాంతిలో నుంచి ప్రజాయాత్ర చేసుకుంటూ వస్తాను. నేను మీలాగా మద్యం అమ్మానా? మోసం చేశానా? మైనింగ్ తవ్వనా? ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను సంపాదించిన కరెన్సీకి ఉన్న నిజాయితీ, నీ అవినీతి సొమ్ముకు ఉండదు బ్రదర్! మైనింగ్‌లు తవ్వి, అక్రమాలు చేసిన అవినీతి సొమ్ముతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఈ సోకాల్డ్ నాయకులు ఓడిస్తారట. రాసి పెట్టుకోండి ఇప్పుడే చెబుతున్నాను. తలరాత రాసిన బ్రహ్మ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు" అని సవాల్ విసిరారు.
వైసీపీ ప్రభుత్వంలో ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆదాయం లేక ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. . ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితమైన మార్పు తీసుకువస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పేదలకు, నివాసం లేని ప్రజలకు టిట్కో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాము తీసుకొంటామని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్రకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇక ధూళిపాళ్ల మాట్లాడుతూ ‘ఈ నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తికి ఈ వైసీపీ నాయకులు రూ. లక్ష దాకా అప్పు పడ్డారు. మన సొమ్మును దోచుకు వెళ్లి రేపు ఎన్నికల్లో తిరిగి రూ. 5 వేలు, రూ. 10 వేలు అంటూ ఓట్లు కొనడానికి వస్తారు. దేవాలయాలు, మందిరాలకు వెళ్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే మనలాంటి భక్తులకు బదులు హుండీలో చేయి పెట్టే దొంగ, దోపిడి నాయకులు మన ప్రాంతంలో ఉన్నారు. 31 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని మా కుటుంబం నమ్ముకుని ఉంది. రాజధాని నిర్మాణానికి అడ్డుపడ్డ కరకట్ట కమలహాసన్ ప్రజలను మోసం చేశారు. అవినీతి సొమ్ముతో నన్ను నాశనం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ దగ్గర అవినీతి సొమ్ము ఉందేమో! నా దగ్గర ప్రజాభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని ఎందుకు అడ్డుకోలేకపోయింది? అది అసమర్థతా? చేతకానితనమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకోవడం చేతకాని నాయకులు పెదకాకానికి వచ్చి తామున్నామని చెప్పి మాట్లాడటం, ప్రజలను ఇంకా మోసపుచ్చటం సిగ్గుచేటు. అలాంటి నాయకుల మాట వింటే మళ్లీ మోసపోవడానికి సిద్ధపడ్డట్టే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగే సత్తా లేని నాయకులు, శివాలయం రోడ్డుని శివాలయం నిధులతోనూ, దర్గా దగ్గరి రోడ్డును దర్గా నిధులతోనూ నిర్మించే స్థితికి చేరారు.’ అని వెల్లడించారు.
ఇక పెదకాకాని మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా పెమ్మసాని ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ గుంటూరు జిల్లా ఇంచార్జ్ కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఏపీలో అనేక పార్టీలు పాలన సాగించినప్పటికీ మాదిగల వర్గీకరణకు కృషి చేసింది టిడిపినే అన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో టిడిపికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పెమ్మసాని గెలుపులో మాదిగల పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com