Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం షూరూ
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళిగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభించనున్నారు.
పిఠాపురం నియోజక వర్గంలో మూడు రోజులపాటు ప్రచారం చేశాక ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు.
తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నేతలకు పవన్ సూచించారు.. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అన్నారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడంపై పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు.
కాగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి సీటు ఆశించిన వర్మ.. పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలియజేశారు. దీంతో ఈ సీటులో వైసీపీ అభ్యర్థి వంగా గీతాను గెలిపించేందుకు సీఎం జగన్ ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout