పవన్ ఢిల్లీ పర్యటన.. సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Thursday,January 23 2020]
జనసేనాని పవన్‌కల్యాణ్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురితో పవన్ కల్యాణ్ కలిశారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోదర్, పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహార్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి భేటీలో చర్చించారు.
మీటింగ్ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మూడు రాజధానులకు అనుమతి ఇవ్వలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఈ మూడు రాజధానుల ప్రక్రియను కేవలం భూ దందా కోసమే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే వైసీపీ నేతలెవరూ రాజధాని తరలింపు విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించలేదని పవన్ తెలిపారు. అమరావతి విషయంలో రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా జనసేనాని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 2న జనసేన, బీజేపీ కలిసి చేయబోయే లాంగ్ మార్చ్ గురించి కూడా ఈ మీటింగ్‌లో చర్చించారు.