Pawan Kalyan: ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం పక్కా.. షెడ్యూల్ ఖరారు..!
- IndiaGlitz, [Tuesday,November 21 2023]
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది.. కానీ ఇంతవరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ప్రచారం చేస్తారా..? లేదా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానంగా జనసేనాని ఎన్నికల కదన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 23వ తేదిన నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కృష్ణారెడ్డితో పాటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోనూ కమలం అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున క్యాంపెయిన్ చేయనున్నారు.
అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగసభలు, రోడ్ షోల్లోనూ పవన్ పాల్గొననున్నారు. దీంతో పవన్ ప్రచారం తమకు మరింత ప్లస్ అవుతుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తోంది. మొత్తానికి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్‌లు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.