Pawan Kalyan: విశాఖ హార్బర్ ప్రమాద బాధితులకు సాయం చేయనున్న పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయని తెలిసింది. బోట్లు కాలిపోయి నష్టపోయిన యజమానులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిస్తా' అని పవన్ వెల్లడించారు. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే అగ్నిప్రమాద బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి సిదిరి అప్పలరాజుకి ఆదేశాలను జారీచేశారు. బాధితులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలని సూచించారు. కష్టకాలంలో వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా మత్స్యకారులకు అధికారులు తగిన తోడ్పాటు అందించాలన్నారు. దీంతో మత్స్యకారులను పరామర్శించిన మంత్రి.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో మత్స్యకారులు బోరున విలపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments