అతి త్వరలో పవన్‌ను సీఎంగా చూడబోతున్నాం!
- IndiaGlitz, [Wednesday,May 01 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అతి తర్వలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న రాష్ట్ర రాజకీయాలను సామాన్యుడి చెంతకు చేర్చాలనే లక్ష్యంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన పడ్డ కష్టానికి రాష్ట్రంలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మంగళవారం భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో నరసాపురం పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన ముఖ్యనేతలు హాజరై పోలింగ్ సందర్భంగా అభ్యర్ధులకు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
సర్వేలతో అక్కర్లేదు..
ఈ సందర్భంగా మాదాసు మాట్లాడుతూ.. సర్వేల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుంది.. ఈ పార్టీ విజయం సాధిస్తుంది అని చెబుతున్నారు. మాకు సర్వేలతో పనిలేదు. జనసేన పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. భవిష్యత్తు కూడా జనసేన పార్టీదే. నిజాయతీ, నిబద్ధత గల నాయకుడిని భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. అతి తర్వలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకి గానీ, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి గానీ భయం. జనసేన అధినేతకు అలాంటి భయాలు లేవు. అందుకే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆంధ్ర రాజకీయాల్లో దొడ్డిదారిన వేలుపెట్టొదు.. కావాలంటే డైరెక్టుగా అభ్యర్ధులను నిలబెట్టి పోటీ చేయాలని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి జన సైనికుడు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.
ఎవరి కొంప ముంచుతాయో!!
పవన్ రాజకీయ సలహాదారుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. అధికారం చేజిక్కించుకోవడానికి జనసేన పార్టీ ఎంతో దూరంలో లేదని.. అతి తర్వలో అధికారం చేపట్టనుందన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువకులు, మహిళలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ కోసం పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బ్యాలెట్ ద్వారా రిలీజ్ చేసిన బులెట్లు ఎవరి కొంప ముంచుతుందోనని అధికార, ప్రతిపక్ష పార్టీలు తలలు పట్టుకుంటున్నాయన్నారు. కోట్లు ఖర్చు చేసి సర్వేలు చేసుకున్నవాళ్లు కూడా గెలుపు తమదేనని చెప్పలేకపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.