Pawan Kalyan:ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మారుస్తాం: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తానే చెబుతానని.. అంతేకానీ దొంగ చాటుగా బయటకు రానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. జనసేన పార్టీ ఎన్డీఏలో ఉంటే ఏంటి? బయట ఉంటే ఏంటి? మీకెందుకు భయం? అని విమర్శించారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తనను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు.
జగన్.. మీ నాన్నకే భయపడలేదు..నీకు భయపడతానా..?
జగన్.. 2009లో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికే భయపడలేదని.. నీకు భయపడతానా అని మండిపడ్డారు. తన లాంటి దేశభక్తి ఉన్న వారు మీకెందుకు భయపడతారు అన్నారు. సర్పంచుల నిధులు రూ.8వేల కోట్లకు పైగా వాడేశారని.. అలాగే భవన నిర్మాణ కార్మికుల నిధి రూ.1200కోట్లు కూడా కాజేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. భారతి సిమెంట్స్, సాక్షి మీడియా ఉన్న మీరు క్లాస్ వార్ గురించి మాట్లాడతారా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు పవన్. జగన్ కానీ వైసీపీ నేతలు కానీ మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీశారా? ప్రజల కోసం ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును కౌలు రైతుల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు.
మద్య నిషేధం అసాధ్యం.. కోరుకున్న చోట మద్యం నిషేధిస్తాం..
అలాగే మద్యనిషేధం అంశంపైనా ప్రసంగించిన పవన్.. మద్య నిషేధం సాధ్యం కాదని.. కానీ మహిళలు కోరుకున్న చోట మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు.
మద్యం నిషేధించిన ప్రాంతంలో అధిక నిధులతో అభివృద్ధి పథకం చేపడతామని తెలిపారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామని మద్యం ధరలు కూడా తగ్గిస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్నారని.. అవి తాగిన ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సేనాని.
రజనీకాంత్‌ను కూడా వైసీపీ నేతలు వదలలేదు..
ఎవరైనా టీడీపీని కానీ జనసేనను కానీ పొగిడితే అవతలి వ్యక్తి ఎంత గొప్పవారు అయినా వైసీపీ నేతలు తిడతారని వ్యాఖ్యానించారు. ఆఖరికి ఎంతో పెద్ద సూపర్ స్టార్ అయిన రజనీకాంత్‌ను కూడా వదలలేదని.. ఆయనను కూడా ఎన్నో మాటలు తిట్టారని పవన్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి జగన్‌ను సాగనంపించే సమయం వచ్చేసిందని ఇక జగన్‌కు టాటా బైబై చెప్పేద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే తనకు సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని లేదంటే బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు.
టీడీపీ నేతలు కూడా అర్థం చేసుకోవాలి..
2014లో రాష్ట్ర భవిష్యత్ కోసం పదేళ్లు కలిసి టీడీపీతో పనిచేయాలనుకున్నానని.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల బయటకు వచ్చానని తెలిపారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కూడా అర్థం చేసుకోవాలని.. గతంలో గొడవలు పక్కనబెట్టి కలిసి పనిచేసి వైసీపీ రాక్షస పాలనను తరిమికొడదామన్నారు. విభేదాలు వదిలేసి జనసేన కార్యకర్తలతో కలిసి పనిచేయండి.. జనసైనికులు కూడా టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com