జగన్.. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: పవన్ వార్నింగ్

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లిళ్లు, పిల్లలపై వైఎస్ జగన్ మాట్లాడటంతో ఇందుకు స్పందించిన పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా దీనంతటికి కారణం ఇంగ్లీషు మీడియం వ్యవహారమే. ఈ వ్యవహారంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య చిచ్చకు కారణమైంది. ‘విజయవాడ నడిబొడ్డున కూర్చుని చెబుతున్నానని, తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదు. జగన్ రెడ్డి గారూ మీరు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారు. సీఎం హోదాకు తగ్గట్టు హుందాగా మాట్లాడడం నేర్చుకోండి. ఎన్నికల ప్రచారంలో ఎలాగూ చిల్లరగా మాట్లాడారు. మీ స్థాయి అది. కానీ మేం మీలాగా కాదు, మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. భాషా సంస్కారాలు మర్చిపోయి మీరు ఎంత హీనంగా మాట్లాడినా మేం మా స్థాయికి దిగజారి మాట్లాడం. కచ్చితంగా పాలసీ విధానాలపైనే స్పందిస్తాం తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్లం’ అంటూ పవన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

నా పెళ్లిళ్ల కారణంగానే జైలుకెళ్లారు!?

‘ప్రాథమిక దశలో ఉన్న విద్యార్థులు అవకతవక నిర్ణయాలతో అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లీషు రాక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతారు. జగన్ గారూ ఎలా పడితే అలా మాట్లాడొద్దు, పద్ధతిగా మాట్లాడితే మంచిది. జగన్‌ను చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం అని, ఒక్కసారి జగన్ రెడ్డి పరిస్థితి తారుమారైతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నేనెప్పుడూ మీ వ్యక్తిగతంపై మాట్లాడలేదు. మిమ్మల్నే కాదు మీ ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ ఓ స్థాయి దాటిందంటే మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసినవాడ్ని. అయితే సంయమనం పాటిస్తున్నాను. ఏం జగన్ రెడ్డి గారూ, నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు, విజయసాయిరెడ్డిగారూ కలిసి రెండు సంవత్సరాలు జైల్లో కూర్చున్నారా? అడిగిన దానికి సరిగా స్పందించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు’ అని జగన్‌ను పవన్ హెచ్చిరిస్తూ మాట్లాడారు. మరి పవన్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.