రాజకీయ వ్యవస్థకి చికిత్స చేస్తా: పవన్
- IndiaGlitz, [Monday,March 04 2019]
నేను ఓ సోషల్ డాక్టర్ని రాజకీయ వ్యవస్థకి చికిత్స చేస్తాను. అందరికీ ఉచిత విద్య, వైద్యం జనసేన లక్ష్యం. కులమతాలకి అతీతంగా అమలుపరుస్తాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని బాన్స్ హోటల్లో విద్యార్ధులతో జరిగిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. విద్యని ఉచితంగా అందించడమే కాదు. విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ స్టేజ్ నుంచే అందర్నీ కులాలవారీగా విడగొడుతూ ఉంటే ఎలా.? అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూడా. జనసేన ప్రభుత్వంలో కులాలు, మతాలకి అతీతంగా కామన్ హాస్టల్ వ్యవస్థని తీసుకువస్తాం. బాధ్యతతో కూడిన పాలన అందిస్తాం. విద్యార్ధులు ప్లకార్డు పట్టుకుంటే స్పందన వచ్చే స్థాయి వ్యవస్థని రూపొందిద్దాం. నిజాయతీపరులు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించడం ద్వారా బాధ్యతతో కూడిన పాలన వ్యవస్థని ఏర్పాటు చేస్తాం అని పవన్ భరోసా కల్పించారు.
నేను కూడా సోషల్ డాక్టర్ని..
మీరు డాక్టర్ అవ్వాలంటే ఐదు సంవత్పరాలు చదివి నేర్చుకుని వైద్యం చేస్తారు కదా. నేను కూడా ఒక సోషల్ డాక్టర్ని. గత ఐదేళ్లుగా ప్రజా సమస్యల్ని చదివా. చాలా నేర్చుకున్నా. ఇక ఈ రాజకీయ వ్యవస్థకి చికిత్స చేస్తా. సమాజానికి శస్త్ర చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. డాక్టర్లు అంతా బయటికి రండి. నాకు ఎంతో నచ్చిన విప్లవ వీరుడు చేగువేరా కూడా డాక్టరే. సమాజానికి చికిత్స చేసేందుకే ఆయన ఉద్యమబాట పట్టాడు.
పరిస్థితుల్ని చూసి పారిపోకండి. స్వతంత్ర పోరాటం నడిపింది కూడా ఓ బలమైన విద్యార్ధి వ్యవస్థే. నాకు రాజకీయం వ్యాపారం కాదు బాధ్యత. నేను మాటలు చెప్పను చేసి చూపిస్తాను. మార్పు మొదలవ్వాలంటే ముందు ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. నడిచి చూపించాలి. ఆ ఒక్కడినే నేను. నేను వెళ్లిన దారికి నా అభిమానులు పెట్టిన పేరు పవనిజం. నా మీద విమర్శలు చేయాలంటే నా ప్రత్యర్ధులు రెండే విషయాలు చెబుతారు. ఒకటి చదువు లేదు అని, రెండు నా వ్యక్తిగత జీవితం అని పవన్ చెప్పుకొచ్చారు.