తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్
- IndiaGlitz, [Friday,January 22 2021]
ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి తిరుమల చేరుకున్న పవన్ నేడు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పవన్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం పవన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల వేంకటేశ్వరుని దర్శనానంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది నుంచి స్వామివారిని దర్శించుకోవాలని భావిస్తున్నానని.. కానీ కరోనా కారణంగా రాలేకపోయానన్నారు. నేడు స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. కాగా.. గురువారం రాత్రి తిరుపతిలో జరిగిన చిత్తూరు జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని.... మరో రెండు మూడు సమావేశాల అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని పవన్ వెల్లడించారు.
#PawanKalyan pic.twitter.com/jVMp5bNwP2
— IndiaGlitz.com™ (@igtelugu) January 22, 2021