Pawan Kalyan: చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుపోయిన జనసేనాని.. రగిలిపోతున్న కార్యకర్తలు..
- IndiaGlitz, [Tuesday,March 12 2024]
రాష్ట్ర రాజకీయాలను మారుస్తాను.. అధికారంలో భాగస్వామ్యం అవుతాం.. అంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎంతలా అంటే పొత్తులో భాగంగా 175 సీట్లలో కేవలం 24 సీట్లు, 25 ఎంపీ స్థానాల్లో 3 ఎంపీ స్థానాలు మాత్రమే చంద్రబాబు జనసేనకు కేటాయించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన జనసైనికులు పవన్‌పై ఫైర్ అయ్యారు. అందుకు జెండా సభలో మాట్లాడుతూ గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి 24 సీట్లు తీసుకున్నాం అంటూ పవన్ కవర్ చేశారు.
ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తులోకి బీజేపీ చేరడంతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అయితే బీజేపీ ఎక్కువ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు జనసేన సీట్లలో చంద్రబాబు కోత విధించారు. అసలే 24 సీట్లు ఇచ్చారని ఆగ్రహంతో ఊగిపోతున్న జనసైనికులు.. ఇప్పుడు అందులోనూ 3 సీట్లు, ఓ ఎంపీ సీటు కోత విధించడంతో రగిలిపోతున్నారు. తమ నాయకుడు ఎందుకు చంద్రబాబుకు ఇంతలా లొంగిపోతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. అసలు పవన్ నిర్ణయాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అపసోపాలు పడుతున్నారు.
ఐదేళ్లుగా జనసేన పార్టీ కోసం పని చేస్తున్నామని.. ఇప్పుడు టీడీపీ కోసం ఇంతలా దిగజారిపోయి పనిచేయాలా అని నిలదీస్తు్న్నారు. పొత్తులో భాగంగా కనీసం 50-60 సీట్లు వస్తాయనుకుంటే 24 సీట్లే ఇచ్చారని వాపోతున్నారు. ఇప్పుడు అందులోనూ మూడు సీట్లకు కోత పెట్టడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 145 సీట్లు దక్కించుకున్న చంద్రబాబు కేవలం ఒక్క సీటు మాత్రమే వదులుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ 21 సీట్లయినా ఉంటాయా.. నామినేషన్ల నాటికి ఇంకా తగ్గిపోతాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు.
ఇంత తక్కువ సీట్లతో ఇక అధికారంలో భాగస్వామ్యం ఎలా అవుతామని ఆవేదన చెందుతున్నారు. అసలు పవన్ ఎందుకు ఇంతలా చంద్రబాబుకు లొంగిపోయారని మదనపడుతున్నారు. సీఎం జగన్ అంటే ఆయనకు ఇంత భయమా.. కనీసం 25 స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేయకపోతే పార్టీ పెట్టుకుని ఏం లాభమని ఫైర్ అవుతున్నారు. టీడీపీ, బీజేపీకి ఊడిగం చేయడం తమ వల్ల కాదని.. రాజకీయాలకు దూరంగా ఉంటామని తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. మరి ఈ 21 సీట్లకు ఎలాంటి మంత్రాలు, స్తోత్రాలు ఉదాహరణగా చెబుతారో అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.