ఢిల్లీ నుంచి ఆదేశాలు.. పవన్ చెప్పినోళ్లకే ఆ కీలక పదవి!?
- IndiaGlitz, [Friday,January 24 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలోని కమలనాథులతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. విలీనం చేయాలని కోరగా.. కుదరదని పొత్తుకే పరిమితమని తేల్చిచెప్పి ‘గ్లాస్‌లో కమలం’లాగా ముందుకెళ్లాలని భావించారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు కలిసి కీలక సమావేశం కావడం.. ఢిల్లీలో సైతం మరోసారి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ అండ్ కలమనాథులు సమావేశం కావడం.. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించడం.. వైసీపీని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపై నిశితంగా చర్చించారు.
ఇదిలా ఉంటే.. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ-జనసేన.. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ అధ్యక్షుడ్ని కన్నా కాకుండా మరొకర్ని మార్చాలని ఎప్పట్నుంచో ఢిల్లీ కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ బాధ్యతలను పవన్ తీసుకోవాలని.. ఆ కీలక పదవిలో మంచి పట్టున్న నేతను నియమించాలని ఢిల్లీ నుంచి పెద్దలు జనసేనానిని ఆదేశించారట. ఈ క్రమంలో ఆ పదవి ఎవరికి కట్టెబెట్టాలా అని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ పదవి కోసం విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, మాధవ్, మాణిక్యాలరావు, దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు సారథులు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడంతో.. పవన్‌కు ఎలాగో ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది గనుక మరో వ్యక్తిని నియమించాలని కాపు వ్యక్తి కాకుండా మరొకర్ని నియమించాలని అటు ఢిల్లీ కమలనాథులు.. ఇటు పవన్ సమాలోచనలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలకు మునుపే అధ్యక్ష పదవి ఎవరికన్నది కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ కీలక పదవి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.