కేసీఆర్‌ను కలుస్తానన్న పవన్.. అప్పాయింట్మెంట్ దొరికేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు, జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కలిశారు. గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను, తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని, సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 3వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నాం. విశాఖపట్నం వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తాను. ఆయన్ని కలసి కార్మికుల సమస్యలు వివరిస్తాను. వారి 24 డిమాండ్లు శ్రీ కేసీఆర్ దృష్టిలో పెడతాను. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని, సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవిస్తాం. ఆయనతో మాట్లాడే అవకాశం రాని పక్షంలో కార్మిక నాయకుల భవిష్యత్ ప్రణాళికకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
అప్పుడు బషీర్‌బాగ్.. ఇప్పుడు కార్మికుల బలిదానాలు!
‘27 రోజుల ఉద్యమంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాను రాను సమస్య పీటముడిలా మారి కొలిక్కిరాకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల మద్దతు, వారు చేసిన పోరాటం తీసిపారేయలేనివి. ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వ పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. సోషలిస్ట్ డెమోక్రసీ విధానాన్ని అవలంభించే మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమ బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అవసరం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాం. 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో బాధ పడడం ఎవరికీ మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో రైతుల ఆవేదన ఎంతగా కలచివేసిందో, ప్రస్తుత సమస్య కుడా నన్ను అంతే కలచివేస్తోంది. ఇప్పుడే కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. కె.కేశవరావు, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లిలకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపుతాను. తెలిసిన నాయకులందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ గారు దీనికి ఒక పరిష్కార మార్గం సూచించాలని కోరుతున్నాం. అంతా కష్టాల్లో ఉన్నారు సామరస్యపూర్వకంగా ఓ రాజీ మార్గం వెతకాలి. ఓ మహిళా కండక్టర్ కూడా చనిపోవడం బాధ కలిగిస్తోంది. భవిష్యత్తు ఉండదన్న నిరాశ, నిస్పృహలకు గురైనప్పుడే బతుకు మీద ఆశపోతుంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దు సమస్య పరిష్కారానికి మా వంతు కృషి మేం చేస్తాం’ అని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అపాయిట్మెంట్ దొరికేనా!?
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘సైరా’ సినిమా విషయంలో కేసీఆర్‌ను కలవడానికి మెగాస్టార్ చిరంజీవి అపాయిట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడం.. తెలంగాణ గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అయితే నాడు అన్నయ్య చిరుకు అపాయిట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు అసలే ఆర్టీసీ కార్మికులపై గరంగరంగా ఉన్న గులాబీ బాస్ అపాయిట్మెంట్ ఇస్తారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout