ఎకరాకు రూ.8 వేలు ఆర్థిక సాయం : పవన్
- IndiaGlitz, [Saturday,March 09 2019]
ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ. 8 వేలు ఆర్ధిక సాయాన్ని అందిస్తామని.. ఇచ్చిన మాటని నిలబెట్టుకుని తీరుతానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో జనసేన వీరమహిళా విభాగం అధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళా దినోత్సవాన రైతు కుటుంబాలకి చెందిన ఆడపడుచుల ఆవేదనని అర్ధం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయనున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలనీ పార్టీ మేనిఫెస్టోలో చేర్చనున్నట్టు ఆయన తెలిపారు. రైతుల క్షేమం కోరుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రైతు కుటుంబాల్లో ఆడపడుచుల భద్రత కూడా దాగి ఉందని.. జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలు చూసిన తరవాత రైతులకి, రైతు కూలీలకి ఉపయోగపడే విధంగా దీన్ని మలచాలని నిర్ణయించామన్నారు. అంతేకాదు ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని పవన్ రైతులకు భరోసా కల్పించారు.
నేను నా తల్లిని నిత్యం గౌరవిస్తా..
నేను నా తల్లిని గౌరవిస్తాను. మహిళా దినోత్సవాలను లక్ష్యం దిశగా చేయాలి. తూతూ మంత్రంగా నిర్వహించడం కాదు. ఏడాది పొడవునా మహిళా సాధికారిత, వారి మానప్రాణ రక్షణ దిశగా ముందుకి వెళ్తామని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నేను రాజకీయాల్లోకి రావడం వెనుక వున్న బలమైన కారణాల్లో ఒకటి ఆడపడుచులపై జరుగుతున్న ఆకృత్యాలు. షూటింగులకి వచ్చే అమ్మాయిల పట్ల ఆకతాయి ప్రవర్తనలు గానీ, పసిబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాల వంటివి నన్ను ఆలోచింప చేశాయి. ఆడపడుచులు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నాను అని పవన్ స్పష్టం చేశారు.