పవన్ - టీజీ కౌంటర్ల వర్షం
- IndiaGlitz, [Thursday,January 24 2019]
టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడిన ‘పొత్తు’ మాటలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే టీజీ మాట్లాడిన కొద్దిసేపటికే విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదు’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అసలు ఈ వివాదం ఏంటి..? ఎవరెవరు ఏమన్నారు..? అందుకు పవన్ ఎలా రియాక్టయ్యారు..? మరోసారి మీడియా ముందుకొచ్చిన టీజీ ఏం చెప్పుకొచ్చారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
టీజీ ఫస్ట్ మాట్లాడిన మాటలివీ..
టీడీపీ-జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయి. సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ- బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీపీ- జనసేన కలిస్తే తప్పేంటి?. టీడీపీతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి అని టీజీ మొదట వ్యాఖ్యానించారు.
జనసేనాని కౌంటర్ ఇదీ..
టీజీ నోరు అదుపులో పెట్టుకో. ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. జనసేన వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటుతో ఎంపీగా గెలిచి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు. టీజీ వెంకటేష్‌కు పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి ఇన్నాళ్లూ మాట్లాడాను. నేను నోరు విప్పితే మీరు ఏమవుతారో తెలియదు. పారిశ్రామికవేత్తగా నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ కలుషితం చేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ఏమీ ఆశించకుండా మద్దతిస్తే అధికారంలోకి వచ్చారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని టీజీ వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
తర్వాత టీజీ కౌంటర్ ఎటాక్..!
ఏదో మీటింగ్‌లో ఉండి స్క్రోలింగ్ చూసి పవన్ స్పందించారు. టెక్స్ట్ పూర్తిగా తెప్పించుకోవాలి. నన్ను పెద్ద మనిషి అన్నందుకు మీకో సలహా ఇస్తున్నాను. మీరు ఎంత ప్రశాంతంగా.. ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది. లీడర్లకు ఆవేశం పనికిరాదు. కార్యకర్తలు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు కానీ నాయకుడికి ఆవేశం ఉంటే దెబ్బతింటారు. ఆ నాయకుడి మీద ఆధారపడిన వాళ్లు కూడా దెబ్బతింటారు. ఎవరైనా మాట్లాడిన విషయం విని ఆ తర్వాత స్పందిస్తే మంచిది. మిమ్మల్ని ఎక్కడా అగౌరవపరిచి మాట్లాడలేదు. ఈ సబ్జక్ట్ అంతా గౌరవించే నేను మాట్లాడాను. మీరు ఒక్కసారి చదువుకొని మాట్లాడండి. ఆ తర్వాత మీకేమైనా అర్థం కాకున్నా.. నేను చెప్పిన సబ్జక్ట్ పొరపాటున్నా మళ్లీ నేను మీడియా ముందుకు వస్తాను అని టీజీ తన ప్రసంగాన్ని ముగించేశారు
మొత్తానికి చూస్తే ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ల వర్షం కురిపించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే మధ్యలో చంద్రబాబు ఎంటరవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా పవన్ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలను టీజీ చెప్పడం.. పవన్ మాత్రం తాను నోరు తెరిస్తే ఏమవుతుందో తెలియదని వ్యాఖ్యానించడం దీని వెనుక పెద్ద వ్యవహారమే జరిగినట్లుంది.